Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అద్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత బలాలబలాను చూస్తే టీడీపీకి రెండు స్థానాలు, వైఎస్సార్ కాంగ్రెస్ కు ఒకటి దక్కే అవకాశాలున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బలం సరిపోయినంతవరకే పోటీచేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. రెండుస్థానాల్లో మాత్రమే అభ్యర్థులను బరిలోకి దింపాలన్నది చంద్రబాబు ఆలోచన. మూడో స్థానం గెలుచుకోవాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను ఆకర్షించగలగాలి. లేదంటే ఇద్దరు ఎమ్మెల్యేలను ఆకర్షించగలిగితే… మూడో అభ్యర్థి విజయానికి బీజేపీ మద్దుతు కీలకమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ప్రసుత్తమున్న సంక్షోభ పరిస్థితుల్లో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలతో ఓట్లు వేయించాలంటే ఆ పార్టీ అధిష్టానం వద్ద మోకరిల్లక తప్పదు.
ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం తీవ్రంగా పోరాడుతున్న టీడీపీ కేవలం ఒకే ఒక్క రాజ్యసభ స్థానం కోసం మళ్లీ బీజేపీతో పొత్తు కోరుకుంటే… అది ఆత్మహత్యాసదృశం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఇద్దరిని మాత్రమే బరిలోకి దింపుతానని ముఖ్యమంత్రి పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించారు. దీంతో ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే ఒక మారు పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న సీఎం రమేశ్… మళ్లీ తనను రాజ్యసభకు పంపించాలని పట్టుబడుతున్నారు. పార్లమెంట్ లో ఆయన దూకుడు, ప్రత్యేక హోదాపై ఆందోళన ఉధృతం చేయాల్సిన అవసరమున్న ప్రస్తుత తరుణంలో సీఎం రమేశ్ వంటి నేత కావాలని భావిస్తున్న చంద్రబాబు ఆయనకు మరోసారి కచ్చితంగా అవకాశం కల్పించనున్నారు. ఇక రెండో స్థానం కోసం పార్టీ సీనియర్ నేత వర్లరామయ్య, బీద మస్తాన్ యాదవ్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరి ఈ ఇద్దరిలో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.