Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాలు ఎంత అనిశ్చితిగా వుంటాయో తెలియంది కాదు . ఒక్కోసారి తిరుగులేని అస్త్రం అనుకున్నది కాస్త తుస్ మంటుంది. ఇంకోసారి దీనిదేముందిలే అనుకున్న విషయం భారీగా బ్లాస్ట్ అవుతుంది. ఈ విషయం అర్ధం చేసుకోకుండా 2004 ఎన్నికలకి ముందు వై.ఎస్, 2014 ఎన్నికలకి ముందు చంద్రబాబు చేసిన పాదయాత్రలు ఇచ్చిన ఫలితాలతో అదే దారిలో రాజకీయ ప్రయాణానికి వైసీపీ అధినేత జగన్ సిద్ధం అవుతున్నారు. నవంబర్ 6 నుంచి తలపెట్టబోతున్న పాదయాత్ర తన పట్టాభిషేకానికి బాటలు వేస్తుందని జగన్ భావిస్తున్నారు. అయితే అపర చాణుక్యుడిగా పేరుపడ్డ చంద్రబాబు ఇప్పటికే జగన్ పాదయత్రకి కౌంటర్ రెడీ చేశారట. మూడు అస్త్రాలతో జగన్ పాదయాత్ర కి తనంత తానే బ్రేక్ వేసుకునే పరిస్థితి తేబోతున్నారు. అవేమిటో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 125 నియోజకవర్గాల్లో పాదయాత్ర, 50 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేయడానికి జగన్ రెడీ అయ్యారు. ఇదంతా చూస్తుంటే ఎన్నికలకి ఏడాది ముందుగానే జగన్ ప్రచారం ప్రారంభించినట్టే. అయితే ఈ ఏడాది కాలం యాత్రలు, ఎన్నికల ప్రచారంతో ప్రజల మధ్య వుండాలని జగన్ అనుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో జగన్ ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్లాన్ సిద్ధం చేశారు చంద్రబాబు. మూడు అస్త్రాలతో పాదయాత్ర కొనసాగించటమా, మాండమా అని జగన్ సందిగ్ధంలో పడేలా వ్యూహం రచించారు.
ఇప్పటికే వైసీపీ బహిష్కరించిన అసెంబ్లీ సమావేశాల గడువు పెంచడం ఇందులో మొదటి అస్త్రం. ప్రతిపక్షం లేకుండానే వివిధ ప్రజాసమస్యలపై చర్చించి పరిష్కారం చూపడం తో పాటు కొన్ని కీలక నిర్ణయాలు, పధకాలు ఈ సమావేశాల్లో ప్రకటించేలా బాబు ప్లాన్ చేశారు.దీంతో విపక్షం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇక బాబు ప్రయోగించే రెండో అస్త్రం మునిసిపల్ ఎన్నికల నిర్వహణ. ఓ పక్క మున్సిపల్ ఎన్నికలు జరుగుతుంటే పాదయాత్ర నుంచి జనం దృష్టి అటు వెళుతుంది. జగన్ సైతం ఈ ఎన్నికల్ని పట్టించుకోకుండా పాదయాత్ర కి పరిమితం కావడం చాలా కష్టం. గతంలో తమిళనాడులో ప్రతిపక్షంలో ఉండగా జయ అసలు ఆ ఎన్నికలకి దూరంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. జగన్ అంత తీవ్ర నిర్ణయం తీసుకోవడమో లేక పాదయత్రకి బ్రేక్ వేయడమో తప్పదు. ఇక చంద్రబాబు గురి చూసి వదిలే మూడో అస్త్రం ఆపరేషన్ ఆకర్ష్. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నాయకత్వలేమితో ఇబ్బంది పడుతున్న వైసీపీ నుంచి ఇంకొంతమంది నేతల్ని విడతల వారీగా టీడీపీ లో చేరేలా స్కెచ్ వేశారు. ఈ మూడు అస్త్రాల్ని తట్టుకుని పాదయాత్ర కొనసాగించడం జగన్ కి అగ్నిపరీక్షే.