Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని నరేంద్రమోడీ దీక్షపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానిగా ఉన్న వ్యక్తి దీక్ష చేయడం దేశచరిత్రలో లేదని మండిపడ్డారు. రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అమరావతిలో ఏపీ పోలీస్ టెక్ టవర్ ను ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. రాజకీయ కారణాల వల్లే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, మరికొన్ని రాష్ట్రాలను ఇప్పుడు రెచ్చగొడుతున్నారని, దీని వల్ల వారే నష్టపోతారని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతే కేంద్రంలో మోడీ ఆనందపడతారని, రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు మోడీ ఆనందపడేలా ప్రవర్తిస్తున్నాయని, పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రధాని విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, తాను ఎవరికీ భయపడేది లేదని తేల్చిచెప్పారు. దేశం మొత్తం తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందని, అందరం కలిసి మోడీపై పోరాటం చేయాలని చంద్రబాబు కోరారు. ప్రధానికి వ్యతిరేకంగా ప్రజలు చాలా చైతన్యం అయ్యారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఆందోళనలు, బంద్ లు, రాస్తారోకోలు చేస్తే రాష్ట్రానికే నష్టమని, ఢిల్లీ వెళ్లి ఆందోళనలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏపీకి మోడీ ద్రోహం చేశారని, ఆయన చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పాలని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.