Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐటీ రంగానికి పునాది పడుతోంది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఆ రంగ పరిస్థితులు అంత బాగా లేనప్పటికీ రానున్న రోజుల్లో దుమ్ముదులపబోతున్న క్లౌడ్ కంప్యూటింగ్ ని ఆసరా చేసుకుని ముందంజ వేయడానికి ఏపీ ఇప్పటికే వ్యూహరచన చేసింది. అందులో భాగంగా మంగళగిరి వద్ద ఏర్పాటైన ” పై డేటా సెంటర్” ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ సమక్షంలో ప్రారంభం అయ్యింది.
బిగ్ డేటా తో నాలుగో తరం పారిశ్రామిక విప్లవం రాబోతోందని ప్రపంచమంతా భావిస్తోంది. అందులో కీలక పాత్ర పోషించే విధంగా డేటా నిక్షిప్తం, విశ్లేషణ చేసేందుకు ఏపీ లో ఎక్కువ డేటా కేంద్రాలు వచ్చేలా ప్రభుత్వం ఇప్పటికే ఓ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. ఇప్పుడు ప్రారంభం అయిన “పై డేటా సెంటర్ ” కూడా ఈ తరహా లో దక్షిణాదిన ఏర్పాటైన తొలి కేంద్రం. టైర్ ఫోర్ శ్రేణికి చెందిన ఈ డేటా కేంద్రాన్ని 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. దాదాపు 5 లక్షల చదరపు అడుగుల కార్యాలయ భవనం నిర్మించారు. ఈ సంస్థ వల్ల ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి కలుగుతుంది. ఈ డేటా కేంద్రంలో మొత్తం 5 వేల రాక్ లని ఏర్పాటు చేశారు. అందులో 1000 ప్రభుత్వ సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి వినియోగిస్తారు.
క్లౌడ్ కంప్యూటింగ్ కి అనువైన డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా 2020 నాటికి ఏపీ కి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ లక్ష్యాన్ని అందుకుంటే ఇంజనీరింగ్ విద్యార్ధులకి విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇక డేటా అనలిటిక్స్ లో పట్టున్న సీనియర్ లకి లక్షలు కురిపించే ఉద్యోగాలు వస్తాయి. అయితే వీటి సంఖ్య పరిమితమే.
మరిన్ని వార్తలు