Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం పెట్టుబడుల వేట మొదలుపెట్టింది. పర్యటనలో భాగంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జూరిచ్ ప్రభుత్వాల మధ్య సిస్టర్ స్టేట్ ఒప్పందం కుదిరింది. చంద్రబాబు సమక్షంలో జురిచ్, ఆంధ్రప్రదేశ్ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లైఫ్ సైన్స్, అర్బన్ రీజనల్ డెవలప్ మెంట్ లో పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం చంద్రబాబు బృందం పయనీరింగ్ వెంచర్స్ చైర్మన్ రాన్ పాల్ తో తొలి ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంది. ఆ సంస్థ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం తో పాటు మహారాష్ట్రలోని నాంధేడ్ లో వ్యవసాయం, వ్యవసాయాధారిత సప్లయ్ చైన్ బిజినెస్ కార్యకలాపాలు సాగిస్తోంది. ఏపీలో సంస్థ విస్తరణకు సంపూర్ణ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి హామీఇచ్చారు.
పండ్ల తోటలు, పాడిపరిశ్రమలో ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టామని, రానున్న ఐదేళ్లలో రూ5వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నామని సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. పూర్తిస్థాయి ప్రణాళికతో వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. ఈ పర్యటనలో చంద్రబాబు పలు అంతర్జాతీయ సంస్థల సీఈవోలు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో సమావేశం కానున్నారు. మంగళవారం ఏపీ లాంజ్ లో ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవుతారు. ఆర్థిక సదస్సులో ఆహార భద్రత, వ్యవసాయ రంగం భవిష్యత్తు, ఏపీలో సహజసాగు విధానాల ద్వారా వ్యవసాయంలో తీసుకొచ్చే మార్పులు వంటి అంశాలపై చంద్రబాబు ప్రసంగించనున్నారు. నాలుగు రోజుల పాటు దావోస్ లో పర్యటించనున్న ముఖ్యమంత్రి బృందంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేశ్, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, వ్యవసాయ సలహాదారు విజయ్ కుమార్, ఈడీబీ సీఈవో కృష్ణ కిషోర్, ఉన్నతాధికారులు సాయిప్రసాద్, సాల్మన్ ఆరోఖ్య రాజ్ తదితరులు ఉన్నారు. ఈ నెల 26న ముఖ్యమంత్రి బృందం దావోస్ నుంచి అమరావతికి తిరిగిరానుంది.