తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయంలో ఊహించని అవమానం ఎదురైంది. సాధారణ ప్రయాణికుల మాదిరిగా భద్రతా సిబ్బంది ఆయనను తనిఖీ చేశారు. హైదరాబాద్ వెళ్ళేందుకు చంద్రబాబు శుక్రవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న ఆయన నేరుగా వాహనంతో విమానాశ్రయం కి వెళ్ళచ్చు, కానీ చంద్రబాబు వాహనాన్ని భద్రతా సిబ్బంది విమానాశ్రయం లోనికి అనుమతించలేదు. తరువాత సామాన్య ప్రయాణికుడి తరహాలో చంద్రబాబును భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. ఎయిర్‌పోర్టు లాంజ్ నుంచి విమానం వరకు ప్రయాణికుల బస్సులోనే చంద్రబాబు వెళ్లాల్సి వచ్చింది. కాగా జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబుకు ప్రత్యేక వాహనం కేటాయించకపోవడం పట్ల తెలుగుదేశం పార్టీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోనూ చంద్రబాబు కాన్వాయ్కి పైలెట్ క్లియరెన్స్ తొలగించడం వల్ల ట్రాఫిక్‌లో చంద్రబాబు వాహనం ఆగితే భద్రతాపరంగా మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ తనిఖీలు జరగడంతో కాస్త రాజకీయ కలకం రేపుతోంది.