నటీనటులు : సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిషోర్, అల్లరి హరీష్, విద్యుల్లేఖా రామన్
సంగీతం : ప్రశాంత్ విహారీ
ఛాయాగ్రహణం : ఎం.సుకుమార్
నిర్మాత : నాగార్జున – జశ్వంత్ నడిపల్లి
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్
హీరోగా కెరీర్ మొదలుపెట్టి పదేళ్లు దాటుతున్నా.. ఇప్పటివరకు సరైన హిట్ ను మాత్రం అందుకోలేకపోయారు సుశాంత్. అప్పట్లో కరెంట్ అనే సినిమా విమర్శకుల ప్రసంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్గా బోల్తా పడింది. అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ పాపం సుశాంత్ కి ఏ సినిమా కలిసి రాలేదు. ఇంతకుముందు విడుదల అయిన ‘ఆటాడుకుందాం రా’ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో డీలా పడిపోయాడు. అయితే నటుడు రాహుల్ చెప్పిన కథ ఆసక్తికరంగా అనిపించడంతో అతడి దర్శకత్వంలో సినిమా చేశాడు. అదే ‘చిలసౌ’. నటుడైన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఎంతో కాలంగా హిట్ లు లేని సుశాంత్ కీ, ఇదే సినిమాతో తన లక్ చెక్ చేసుకోవాలన్న రాహుల్ కి ఎంతమేరకు కలిసొచ్చింది అనేది లోపలి రివ్యూలో చూడండి.
స్టోరీ లైన్ :
అర్జున్(సుశాంత్) ఒక బిజినెస్ డెవలప్మెంట్ ఫర్మ్ లో ఉద్యోగం చేస్తుంటాడు. మంచి జీతం, బంగారంలా చూసుకునే అమ్మానాన్న, విలాసవంతమైన ఇల్లు కానీ రెండే రెండు కోరికలు ఒకటి తనడ్రీం కార్ కొనుక్కోవడం, మరొకటి ఒక్కడే యూరప్ ట్రిప్ వెళ్లి రావడం అందుకే ఇంట్లో అమ్మా నాన్న పెళ్లి చేసుకోమని ఎంత బలవంతపడుతున్నా పెళ్ళికి మాత్రం ఒప్పుకోడు. ఇలాంటి సమయంలో అర్జున్ వాళ్ళ అమ్మ బలవంతంగా అంజలి(రుహానీ శర్మ)తో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తుంది. అంజలికి కూడా స్వతహాగా పెళ్లి ఇష్టం లేకపోయినా తన తల్లికి ఉన్న ఆరోగ్య సమస్య కారణంగా అంజలి కూడా అర్జున్ ని కలవడానికి ఒప్పుకుంటుంది. ఇలా పెళ్లంటే ఇష్టంలేని వీరిద్దరూ ఒకరినొకరు కలిసిన తరువాత ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి..? వారిద్దరూ ఒక మర్డర్ కేసులో చిక్కుకుంటారు ? ఆ మర్డర్ ఎవరిదీ ? ఎవరు చేసారు ? అసలు వారిద్దరూ పెళ్లి చేసుకుంటారా ? ఇలా ఒక రోజులో జరిగే కథతో దర్శకుడు రాహుల్ ఈ సినిమాను ఎలా తెరకెక్కించాడో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ :
ఈ మధ్య పెద్ద సినిమాలకే కాదు, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు కూడా గోల్డెన్ టైమ్ నడుస్తుంది. ముఖ్యంగా చిన్న కథలను కూడా సినిమాగా తెరకెక్కించే విధానాన్ని గ్రాండ్ గా చూపెట్టిన సినిమాలకి ఇట్టే కనెక్ట్ అవుతున్నారు. దానికి పెళ్లిచూపులు లాంటి సినిమానే ఉదాహరణ, ఇప్పుడు సుశాంత్ కూడా ఇదే చేసాడు పెళ్లి చూపులు కాన్సెప్ట్ ఏ అయినా దర్శకుడు తెరకెక్కించిన తీరు ఖచ్చితంగా ఆకాట్టుకుని తీరుతుంది.
భారీ కాస్ట్, ఫారెన్ లొకేషన్స్, భారీ యాక్షన్ సీన్స్ అంటూ రెగ్యులర్ ఫార్మాట్ వంకే చూడకుండా తను నమ్ముకున్న కథను ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా తీయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు రాహుల్. పెళ్లంటే ఇష్టంలేని ఓ యువకుడి జీవితంలో పెళ్లిచూపులు అనేవి ఎన్ని పెను మార్పులు చోటుచేసుకున్నాయనేదే ఈ కథ. సాయంత్రం 7 గంటలకు అమ్మాయితో పెళ్లిచూపులు మొదలైతే ఉదయం 8 గంటల్లోపు ఇద్దరూ ఏకంగా పెళ్లిచేసుకోవడమనే కాన్సెప్ట్ దర్శకుడు అత్యద్భుతంగా తెరకెక్కించాడు రాహుల్. సుమారు పన్నెండు గంటల్లో కొద్దిసమయంలో వీరి జీవితంలో చోటుచేసుకున్న ఊహించని సంఘటనల కారణంగా ఇద్దరూ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనే విషయాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు.
ఇంతకు ముందు చేసిన సినిమాలతో పోలిస్తే సుశాంత్ నటన పెద్దగా ఏమీ మారకపోయినా పెద్దగా నటించడానికి స్కోప్ లేని పాత్ర కాబట్టి నేట్టుకోచ్చేసాడు సుశాంత్. ఫస్ట్ హాఫ్ కాస్త బోరింగ్ గా అనిపించినా సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. దర్శకుడిగా రాహుల్ మొదటి సినిమా అయినా తన టేకింగ్ తో ఎంతో అనుభవమున్న దర్సకుడిలా తెరకెక్కించాడు. పెద్దగా ప్రాసలు, పదప్రయోగాల జోలికి వెళ్లకుండా సహజ సంభాషణలతో అతడు రాసుకున్న డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం యూత్ కి కనెక్ట్ అయ్యే పాయింట్ తీసుకొని సగం మార్కులు కొట్టేసిన రాహుల్ సినిమాను మరింత ఎంటర్టైనింగ్ గా రూపొందించి నూటికి నూరు శాతం సక్సెస్ సాధించాడు. ఇక హీరోయిన్ రుహనీ శర్మ ఇక సినిమాకు మరో ప్లస్.ఆమె సింపుల్ గా చెప్పే డైలాగ్స్, మాట తీరు, మేకప్ లేని ముఖం అన్నీ రియలిస్టిక్ గా అనిపించాయి. తెరపై వీరిద్దరి జంట బాగుంది. ఇక హీరో తల్లి పాత్రలో అను హాసన్ తన పరిధి మేరకు బాగానే చేసినా హీరోయిన్ తల్లి పాత్రలో రోహిణి అద్భుత నటన కనబరిచింది. ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ ఆమె వల్లే అంత బాగా వచ్చాయి అనుకోవచ్చు. అయితే సుశాంత్ – వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ సినిమాకి మరింత ప్లస్, వెన్నెల కిషోర్ తన నటనతో ఆకట్టుకున్నాడు. దీంతో సందర్భానికి తగ్గట్లుగా వచ్చే పాటలు, నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. సినిమాటోగ్రఫీ వర్క్ మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది.