Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చైనా కుయోక్తులుపనిచేయలేదు. బ్రిక్స్ దేశాల సదస్సులో మిత్రదేశం పాకిస్థాన్‌పై ఈగ వాలనివ్వకుండా చూడటానికి చైనా ఎంతగా ప్రయత్నించినా…చివరకు ఎదురుదెబ్బ తప్పలేదు. బ్రిక్స్ సదస్సు లోనే తొలిసారిగా…పాక్ ఉగ్రవాద సంస్థల పేర్లును సభ్యదేశాలు ప్రస్తావించాయి. తద్వారా పాక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నట్టు పరోక్షంగా అంగీకరించాయి. షామన్ లో జరుగుతున్న ఈ సదస్సులో ఉత్తరకొరియా ఉద్రిక్తతలు, ఉగ్రవాదంపై సభ్యదేశాల అధినేతల మధ్య విస్తృతంగా చర్చ జరిగింది. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన బ్రిక్స్ దేశాలు అందులో భాగంగా పాకిస్థాన్ లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల పేర్లను ప్రస్తావించాయి.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాలు ప్రకటించిన డిక్లరేషన్ లో ఈ ప్రస్తావన వచ్చింది. అమాయక అఫ్ఘాన్ ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్న ఉగ్రదాడులను సభ్యదేశాలు ఖండించాయి. తాలిబన్, ఐఎస్ఐఎల్, ఆల్‌ఖైదా, దాని అనుబంధ సంస్థ ఈస్టన్ టర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమం, హక్కానీ నెట్ వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుత్ తహ్రీర్ వంటి ఉగ్రవాదసంస్థలు చేసే హింస వల్ల ప్రపంచంలో ఆందోళనకర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని బ్రిక్స్ డిక్లరేషన్ వెల్లడించింది. ఈ డిక్లరేషన్ తో చైనా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయింది.
జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని, ఐక్యరాజ్యసమితిలో గత ఏడాది భారత్ కోరింది. పాక్ కు మిత్రదేశంగా ఉన్న చైనా పలుమార్లు దీనికి అడ్డంకులు సృష్టించింది. ఈ లోగా భారత్ పిటిషన్ గడువు పూర్తయింది. అయితే అమెరికా కూడా జైషే మహ్మద్ ను ఉగ్రవాదసంస్థగా ప్రకటించాలని తీర్మానం చేసింది. యూకె, ఫ్రాన్స్ ఈ తీర్మానానికి మద్దతు తెలిపితే…చైనా మాత్రం తన నిర్ణయం చెప్పేందుకు గడువు పొడిగిస్తోంది. ఇలాంటి తరుణంలో బ్రిక్స్ డిక్లరేషన్ లో జైషే మహ్మద్ పేరు వాడటంతో చైనా ఇరకాటంలో పడింది. బ్రిక్స్ సభ్యదేశంగా చైనా కూడా జైషే మహ్మద్ చర్యలను ఖండించినట్టయింది. దీంతో ఐక్యరాజ్యసమితిలో మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు చైనా అంగీకరించాల్సిన పరిస్థితి ఎదురయింది.
మరిన్ని వార్తలు:
ఎన్నిరోజులైనా గుండెలో బుల్లెట్ అలాగే ఉంది
వంగవీటి గొడవపై వర్మ వివాదాస్పద కామెంట్లు
అప్పుడు ఇందిర…ఇప్పుడు నిర్మల