Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డోక్లామ్ సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా ముందస్తు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటోంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో భారత్ లోని తమ దేశ ప్రజలకు చైనా…భద్రతా పరమైన సూచనలు చేసింది. ఢిల్లీలోని చైనా ఎంబసీ ఈ అడ్వైజరీ జారీ చేసింది. చైనా ప్రజలు భారత్ లో అనసవర ప్రయాణాలు తగ్గించుకోవాలని ఆ దేశం సూచించింది. భారత్ లో ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, రోగాలు తరచుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తాయని, వీటితో చైనీయులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. వ్యక్తిగత భద్రతను పెంపుందించుకోవాలని సలహా ఇచ్చింది. స్థానిక మతాచారాలు, సంప్రదాయాలకు గౌరవం ఇవ్వాలని సూచించింది. డిసెంబరు 31 వరకు ఈ అడ్వైజరీ వర్తిస్తుందని చైనా ఎంబసీ తెలిపింది.
డోక్లాం ప్రతిష్టంభన తరువాత చైనా ఇలా తమ దేశ పౌరులకు అడ్వైజరీ జారీ చేయటం ఇది రెండోసారి. జులై 8 న ఇలాగే తమ దేశ పౌరులకు సలహాలు, సూచనలు ఇచ్చిన చైనా…నెలరోజుల పాటు ఆ అడ్వైజరీ వర్తిస్తుందని అప్పుడు తెలిపింది. డోక్లాం సమస్య అంతకంతకూ తీవ్రమవుతుండటంతో తమ ప్రజలను అప్రమత్తం చేసేందుకే చైనా ఇలా అడ్వైజరీలు జారీచేస్తోంది. భారత్-భూటాన్-చైనా ట్రైం జంక్షన్ వద్ద చైనా చేపట్టిన రహదారి నిర్మాణాన్ని భూటాన్ కోరిక మేరకు భారత్ అడ్డుకుంటోంది. ఈ వివాదం వల్ల ఇరుదేశాల మధ్య రెండు నెలల క్రితం మొదలయిన డోక్లామ్ సమస్య చైనా మొండివైఖరితో మరింత జటిలంగా మారుతోంది. సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుందామని భారత్ కోరుతోంటే…చైనా మాత్రం సరిహద్దుల్లో మోహరించిన భారత సైన్యాన్ని ఉపసంహరించాల్సిందే అని డిమాండ్ చేస్తోంది. మరో పక్క తాను మాత్రం సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. అటు చైనా అధికార పత్రికలు, సోషల్ మీడియాలో భారత్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేస్తోంది. దీంతో రెండు దేశాల మద్య ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
మరిన్ని వార్తలు: