Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డోక్లామ్ ప్రతిష్టంభన సాగిన రెండున్నర నెలల కాలంలో వచ్చిన ఓ అలవాటును వివాదం ముగిసిన తర్వాత కూడా చైనా మార్చుకోలేకపోతోంది. డోక్లామ్ సరిహద్దుల్లో ఇరు దేశాల సైన్యం మోహరించి ఉన్న సమయంలో భారత్ కు అదే పనిగా హెచ్చరికలు చేసిన చైనా…ఇప్పుడూ వాటిని కొనసాగిస్తోంది. డోక్లామ్ వివాదం నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని చైనా ఆర్మీ వ్యాఖ్యానిస్తే…ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యి మరో అడుగు ముందుకేసి భారత ఆర్మీ గీత దాటడం వల్లే డోక్లామ్ సమస్య తలెత్తిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్తులో మరిన్ని డోక్లామ్ ఘటనలు జరగకుండా చూసుకోవాలని, ప్రస్తుత వివాదం నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని ఆయన హెచ్చరించారు. రెండు దేశాల మధ్య మళ్లీ సమస్యలు తలెత్తకుండా ఉండటానికి వీలుగా స్థిరమైన, ఆరోగ్యకరమైన అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. భారత్, చైనా మద్య కొన్ని సమస్యలు ఉన్న మాట నిజమే అని, అయితే ఇరుదేశాల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని దేశాధినేతల ఏకాభిప్రాయం ప్రకారం వాటిని పరిష్కరించుకుంటామని ఆయన చెప్పారు. రెండు దేశాలు సహకరించుకోవాలన్నది బారత్, చైనా ప్రజల ఆకాంక్ష మాత్రమే కాదని, అంతర్జాతీయ సమాజం ఇందుకోసం ఎదురుచూస్తోందని వాంగ్ యి అభిప్రాయపడ్డారు.
రెండు దేశాల మధ్య పూర్వపు సంబంధాలు నెలకొనేందుకు కలిసి పనిచేస్తామని తెలిపారు. డోక్లామ్ వివాదం ముగిసిన నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు వాంగ్ ఇలా సమాధానాలిచ్చారు. డోక్లామ్ సమస్య ముగిసిన తర్వాత కూడా చైనా ఇలా భారత్ ఏదో తప్పుచేసినట్టు అర్ధం వచ్చేలా మాట్లాడటంపై విదేశీ వ్యవహారాల నిపుణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యుద్ధం దాకా వెళ్లిన సమస్యను భారత్ ఎలాగోలా కష్టపడి సుదీర్ఘ దౌత్యపరమైన చర్చలకు ఒప్పించి పరిష్కారం చేసుకుంటే చైనా మళ్లీ ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వార్తలు: