ప్రముఖ సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి తాజగా మీ టూ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గోంటోంది. సినీ ఇండస్ట్రీలో పలువురికి జరిగిన అన్యాయాలను చాలా దైర్యంగా సోషల్ మీడియా వేదికగా బహిరంగ పర్చుతోంది. తాజాగా చిన్మయి ప్రముఖ కవి, రచయిత వైరముత్తు పై సంచలన ఆరోపణలు చేసింది. మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న వైరముత్తు బండారాన్ని బయట పెట్టింది. తాజాగా మీ టూ ఉద్యమంలో భాగంగా చిన్మయికి కొందరు మద్దతుగా ఉంటే మరికొందరు వ్యతిరేకంగా ఉన్నారు. చిన్మయిపై వస్తున్న విమర్శలపై చిన్మయి తల్లి పద్మాసిని స్పందించింది.
ఒక టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన చిన్మయి తల్లి పద్మాసిని… నేను చిన్మయి ఒక ఆడియో ఫంక్షన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లాము. కార్యక్రమం పూర్తయ్యాక అంతా అక్కడి నుండి వెళ్లారు కానీ మమ్మల్ని కాసేపు వెయిట్ చెయ్యమన్నారు. తర్వాత ఒక వ్యక్తి వచ్చి చిన్మయి కోసం వైరముత్తు ఎదురు చూస్తున్నాడు అని చెప్పాడు. చిన్మయిని మాత్రమే గదిలోకి వెళ్లమని చెప్పాడు. ఎందుకు ఈ రహస్య కలయిక అని తాను ప్రశ్నించగా వైరముత్తుకు కాస్త సహకరించండి అంటూ వింత సమాధానం ఇచ్చాడు. దాంతో మేము ఆ పనికి వేరే వారిని చూసుకోండి మేము అలా కాదు అని అక్కడి నుండి వచ్చేశాం అంటూ పద్మాసిని చెప్పుకొచ్చారు. మీ టూ లో భాగంగా మహిళలంతా ఒక్కటవ్వాలని, తమకు జరిగిన అన్యాయాలను ప్రశ్నించాలని చిన్మయి తల్లి పిలుపునిచ్చారు.