Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ డిజైన్లంటూ హడావిడి చేసిన తెలంగాణ మంత్రి తుమ్మల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. ఆయన చూపించేసిన డిజైన్లు ఇంకా సీఎం ఆమోదం పొందలేదని లీకులొచ్చాయి. అవెప్పుడో గతంలో ఆమోదించినవి, మళ్లీ సెక్రటేరియట్ నిర్మాణ కసరత్తు మొదలెట్టాక.. కేసీఆర్ ఆ ప్లాన్లు చూడలేదని, వాటిని ఆమోదించే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. కేసీఆర్ కూడా తుమ్మల దూకుడుపై కాస్త అసంతృప్తిగా ఉన్నారు. సీఎం ఆమోదం లేకుండా డిజైన్లు ఇవేనని ఎలా చెబుతారని సీఎంఓ నుంచి తుమ్మలను వివరణ అడిగారట. ఈ మొత్తం ఎపిసోడ్ లో తుమ్మల టార్గెట్ అయ్యారు. బైసన్ పోలో గ్రౌండ్లో సచివాలయం కట్టొద్దని విపక్షాలు ఆందోళన చేస్తున్న సమయంలోనే.. ఇలాంటివి జరగడం టీఆర్ఎస్ ప్రభుత్వ పరువుకు నష్టం చేసింది. అమరావతిలో కొత్త బిల్డింగులు కడుతున్నారు కాబట్టి.. హైదరాబాద్ లో తన ముద్ర కోసం కేసీఆర్ తపిస్తున్నారని విపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్న చందంగా కేసీఆర్ ఆలోచనలున్నాయని, అన్ని భవనాలు ఉన్న హైదరాబాద్ లో కొత్త భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారని నిలదీస్తున్నారు. కానీ ఎవరేమనుకున్నా కొత్త సెక్రేటరియట్ కట్టే తీరతామంటోంది సర్కారు.
మరిన్ని వార్తలు: