కడప ఉక్కు కర్మాగారం కోసం టీడీపీ నేతలు చేస్తున్న దీక్షలు కొంగ జపాన్ని తలపిస్తున్నాయంటూ జనసేన చేసిన వ్యాఖ్యల మీద సీఎం రమేష్ ఫైర్ అయ్యారు. నీరసంతో మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికీ ఓపిక తెచ్చుకుని మరీ ఆయన మీడియాతో మాట్లాడారు. దీక్షను నీరుగార్చేలా, దీక్ష పవిత్రతను శంకించేలా జనసేన మాట్లాడుతున్న మాటలు చాలా దారుణమని అన్నారు. కడప పౌరుషాన్ని రెచ్చగొట్టొద్దు అంటూ ఈ సందర్భంగా జనసేనకి వార్నింగ్ ఇచ్చారు. కమీషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని లేదంటే మీరు ఏం చేస్తారో ప్రకటించండి అని ఆయన సవాల్ చేశారు. ఇదేమీ సినిమా కాదు, ప్రజారాజ్యం పార్టీ అంతకన్నా కాదునని ఎద్దేవా చేశారు.
నీవు చేసిన ఆరోపణలపై మనమిద్దరమే మాట్లాడుకుందామని ఈ విషయాన్ని కాణిపాకం ఆలయానికి వెళ్లి ప్రమాణం చేస్తావా? దీక్ష అంటే ఏమనుకుంటున్నావు? అసలు నీకు రాజకీయాలు తెలుసా? దీక్షా శిబిరానికి వచ్చి మాట్లాడు. అసలు జిందాబాద్ లు నీకు తెలుసా? అని పవన్ కి ప్రశ్నల వర్షం కురిపించారు. ఉక్కు పరిశ్రమ రాకుండా రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుందంటూ పవన్ చేసిన ఆరోపణలు ఆయన అవగాహనా రాహిత్యాన్ని సూచిస్తున్నాయని రమేష్ పేర్కొన్నారు. చేసిన ఆరోపణలపై పవన్ కల్యాణ్ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే దీక్షాస్థలికి వచ్చి మాట్లాడాలని అన్నారు. తాము చేపట్టిన దీక్ష స్వప్రయోజనాల కోసం కాదని… భావి తరాల కోసమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.