ఎన్నో తెలుగు సినిమాల్లో హాస్యనటుడిగా నటించి, ఇప్పుడు పూర్తిగా తగ్గించివేసిన ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ ఇక సినిమాలకి దూరంగా జరిగి, రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నారు. వేణు మాధవ్ స్వస్థలం కోదాడ. మొదటగా మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించిన వేణు మాధవ్ ఆ తరువాత టీడీపీ తరపున రాజకీయ ప్రచారం కూడా చేశాడు. టీడీపీ పార్టీ నుండి కోదాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఆశిద్దామని అనుకున్న వేణు మాధవ్ అందుకు అవకాశం లేకపోయేసరికి స్వతంత్ర అభ్యర్థిగా నేడు ఉదయం 11 గంటలకు నామినేషన్ ను దాఖలు చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన సమాచారం మీడియా విలేకరులకు నిన్న బుధవారమే చేరవేశారు.
వేణు మాధవ్ కుటుంబానికి కూడా రాజకీయ నేపధ్యం ఉండడం, ఆయన సన్నిహితులు కూడా రాజకీయాల్లో క్రియాశీల పాత్రలు పోషిస్తుండడం తో వేణు మాధవ్ కూడా రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేయాలనీ ఉవ్విళ్లూరుతున్నారు. ఆ మధ్య వేణు మాధవ్ చనిపోయాడంటూ మీడియాలో వార్తలు వచ్చేసరికి, అవి నిజం కాదని తెలుపడానికి మీడియా ముందుకు వచ్చిన వేణు మాధవ్ మళ్ళీ ఆ తరువాత కనిపించింది లేదు. అటు కమెడియన్ గా సినిమాల్లో కనిపించక, ఇటు కనీసం మీడియా ముందు మొహం చాటెయ్యక అజ్ఞాతంలో ఉండి, తీరా ఎన్నికల సమయం వేళ కనిపించి, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తుండడం కాస్త ఆశ్చర్యం గొలిపే విషయమే. అది కాకుండా, కోదాడ నియోజకవర్గం నుండి పోటీచేయబోతున్న తెరాస మరియు మహాకూటమి నాయకులను దాటుకొని వేణు మాధవ్ ఎలా నిలబడతాడో అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం. కమెడియన్ గా సినిమాలో వేణు మాధవ్ చివరిసారిగా కనిపించిన చిత్రం రుద్రమదేవి. ఆ తరువాత నుండి ఎటువంటి సినిమాలో నటించకపోగా, అందుకు గల కారణం కూడా తెలుపలేదు.