Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 10వేల నగదు చెల్లించాలని, ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలని, ప్రతి బుధ, ఆదివారాల్లో పంజాగుట్ట పోలీసుల ముందు గజల్ శ్రీనివాస్ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో ఎ2 నిందితురాలిగా ఉన్న పార్వతికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పార్వతిని ఇంతవరకూ అరెస్టు చేయకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. ఆమె పరారీలో ఉండడంతో అరెస్ట్ చేయలేకపోయామని పోలీసుల తరపు న్యాయవాది చెప్పారు.
ఓ యువతి ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ ను ఈ నెల 2న పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. మెట్రోపాలిటన్ కోర్టులో గజల్ శ్రీనివాస్ బెయిల్ కోసం దాఖలుచేసిన పిటిషన్ తిరస్కరణకు గురవ్వడంతో ఈ నెల 12న నాంపల్లి సెషన్స్ కోర్టులో గజల్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇవాళ నిందితులిద్దరికీ బెయిల్ మంజూరు చేశారు.