తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి మీద జరుగుతున్న ఒక ప్రచారం ఇప్పుడు తెలంగాణా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అదేంటంటే ఈ సారి కాంగ్రెస్ సహా మహా కూటమి సీఎం అభ్యర్ధి దళితుడే ? ఈ నినాదంతోనే ఈ సారి ఎన్నికలకు టీ కాంగ్రెస్ సిద్ధమౌతోందని తెలుస్తోంది. ఈ వ్యూహం ప్రకారమే కాంగ్రెస్ లో కీలక కమిటీలలో దళిత నేతలకు అత్యధిక ప్రాధాన్యం ఉండేలా చుసుకుందని తెలుస్తోంది. తెలంగాణ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కాంగ్రెస్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తెరాస ను గద్దెదించి అధికారం చేపట్టాలనే వ్యూహంతో కాంగ్రెస్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది…అందులో భాగంగానే కాంగ్రెస్ దళిత నాదం ఎత్తుకొన్నట్లు తెలుస్తోంది..
తాజాగా ఏఐసీసీ ప్రకటించిన రాష్ట్ర కమిటీ లను చూస్తుంటే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది..ప్రచార కమిటీ, మానిఫెస్టో వంటి కీలక కమిటీల చైర్మన్ లు గా ఎస్సీ సామాజికవర్గాల వారిని నియమించటం వెనుక కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటో అర్థమౌతుంది. కెసిఆర్ గత ఎన్నికల ముందు ఇచ్చిన దళిత ముఖ్యమంత్రి హామీని ఈసారి కాంగ్రెస్ అధికారం లోకి వస్తే అది నిజం చేయాలని చూస్తోంది. గతంలో టీ.అంజయ్య, సంజీవయ్య లను ముఖ్యమంత్రులను చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కింది. ఆ పాయింట్ ను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది.
తాజాగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మల్లు భట్టివిక్రమార్కను ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించడాన్ని చూస్తుంటే ఆయనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు బోలెడుమంది సీఎం రేసులో ఉన్నప్పటికీ, వారిలో ఏ ఒక్కరికి కట్టబెట్టినా పెద్ద పంచాయతే అవుతుంది. కాబట్టి, వ్యూహాత్మకంగా దళితుడికి సీఎం పీఠం కట్టబెడతామని చెప్పడం మూలంగా ఇటు దళిత,అణగారిన వర్గాల ఓట్లతో పాటు, రెడ్డి నాయకుల నోళ్లకు తాళం వేయొచ్చన్న అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది.
మల్లు భట్టివిక్రమార్కతో పాటు దామోదర రాజనర్సింహను కూడా మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా చేయడం, అలాగే అన్ని విభాగాల్లోనూ దళిత సభ్యులు ప్రముఖంగా ఉండటం చూస్తుంటే కాంగ్రెస్ స్ట్రాటజీ అర్థమవుతోంది.