దిగ్విజయ్ నోరు మూయించిన ఏపీ నేత.

congress-leader-fires-on-digvijay-singh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితం మీద సమీక్షా సమావేశం కోసం ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఇటీవల విజయవాడ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పటిలాగానే ఇది ఓ మాములు సమావేశం అనుకున్నారు ఆయన. ముందుగా నంద్యాల లో పార్టీ పరిస్థితి మీద దృష్టి సారించారు. మైనారిటీ అభ్యర్థిని నిలబెట్టినా 2014 కంటే తక్కువ ఓట్లు వచ్చిన విషయాన్ని అంతా గుర్తించారు. పార్టీ పరిస్థితి అంతకంతకూ దిగజారుతోందనీ, ఎలాగైనా పార్టీని కాపాడుకోవాలని నేతలకు ఎప్పటిలాగానే దిగ్విజయ్ సుతిమెత్తని క్లాస్ పీకబోయారు. అప్పుడే ఎవరూ ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుందట.

ఒకప్పుడు దిగ్విజయ్ ని చూస్తేనే భయం,భక్తి చూపించే ఓ నాయకుడు పైకి లేచి మాట్లాడడం మొదలు పెట్టాడట. ఇప్పుడు మీరు గట్టిగా మాట్లాడితే ఈ వున్న కొద్ది మంది నాయకులు కూడా వేరే దారి చూసుకుంటారు తప్ప జరిగేదేమీ ఉండదని ఆ నాయకుడు దిగ్విజయ్ తో కుండ బద్దలు కొట్టారట. ఇక్కడున్న చాలా మంది ఇంకో దారి లేక లేదా అలవాటు కొద్ది మాత్రమే పార్టీ లో వున్నారు తప్ప ప్రేమతో కాదని కూడా ఆ నేత బోల్డ్ గా చెప్పేశాడట. ఆ రోజు నెత్తినోరు కొట్టుకున్నా మీరు మా మాట వినకుండా రాష్ట్రాన్ని విభజించారని,ఇప్పుడు జనం మళ్ళీ ఆదరించాలని ఎలా ఆశిస్తున్నారని దిగ్విజయ్ ని నిలదీశారట. నిజంగా మీకు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నిలదొక్కుకోవాలని ఉంటే ఒకే ఒక్క పని చేయండి అంటూ ఆ నేత ఓ సలహా కూడా ఇచ్చారట. సోనియా లేదా రాహుల్ తో రాష్ట్ర. విభజనకి సంబంధించి క్షమాపణ చెప్పిస్తే పరిస్థితి లో ఎంతోకొంత మార్పు వస్తుందని ఆ నాయకుడు అనడంతో అంతా సైలెంట్ అయిపోయారంట. ఇక దిగ్విజయ్ మొహం అయితే నెత్తురు చుక్క లేకుండా అయిపోయిందట. ఆ పై కొద్దిసేపటికే సమావేశాన్ని ముగించారట. దిగ్విజయ్ కూడా పరిస్థితికి తగ్గట్టు మౌనం వహించారట. అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా చూడాలని మాత్రం కోరారట. సమావేశం అయ్యాక ఇంతగా రెచ్చిపోయిన ఆ నేతని మిగిలిన వాళ్ళు దాని గురించి ప్రశ్నిస్తే ఇక కొత్తగా పోయేది ఏముంది అని వారినే ఎదురు అడిగాడట.