Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. సుప్రీంకోర్టు పాలనావ్యవస్థ సరిగా లేదంటూ దేశ చరిత్రలో తొలిసారి ఈ ఏడాది జనవరిలో నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చిన తరువాత భారత ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన అంశంపై తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం ప్రస్తావించిన జస్టిస్ లోయా మృతి సహజమైనదే అని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చీఫ్ జస్టిస్ పై అభిశంసన తీర్మానాన్ని కాంగ్రెస్ ముందుకు తెచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఛాంబర్ లో ఈ ఉదయం కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీ పార్టీల నేతలు సమావేశమై సీజేఐపై అభిశంసన గురించి చర్చించారు. ఆ తర్వాత వారు ఉపరాష్ట్రపతిని కలిసి నోటీసు అందించారు. ఈ నోటీసుపై కాంగ్రెస్ సహా ఏడు ప్రతిపక్ష పార్టీలకు చెందిన 60 మంది రాజ్యసభ ఎంపీలు సంతకం చేసినట్టు తెలుస్తోంది.
తొలుత తృణమూల్ కాంగ్రెస్, డీఎంకె కూడా కాంగ్రెస్ డిమాండ్ తో ఏకీభవించినప్పటికీ… ప్రస్తుతం ఆయా పార్టీలు దూరంగానే ఉన్నాయి. అటు ఈ అంశంపై అత్యున్నతన్యాయస్థానం స్పందించింది. ప్రధాన న్యాయమూర్తి అభిశంసనపై బహిరంగ చర్చ జరగడం చాలా దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారత చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుండడంతో ఈ అంశాన్ని మీడియా కవర్ చేయకుండా నిరోధించాలని కోరుతూ పూణెకు చెందిన న్యాయవాద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి అభిశంసనను మీడియా కవర్ చేయకుండా నిషేధించడంపై అభిప్రాయాలు తెలియజేయాలని అటార్నీ జనరల్ ను సుప్రీంకోర్టు కోరింది. మధ్యంతర ఆదేశాలు జారీచేయడానికి నిరాకరించింది. అటార్నీ జనరల్ నుంచి స్పందన వచ్చేంత వరకు వేచిఉండాలని సూచిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.