Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆన్ లైన్ షాపింగ్ లో అనేక మోసాలు జరుగుతున్నాయని, కోరుకున్న వస్తువు కాకుండా అట్టపెట్టెల్లో ఏదో వస్తువో, లేదంటే రాళ్లో పెట్టి పంపిస్తున్నారని ఇప్పటిదాకా అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి. వాటిపై దృష్టిపెట్టిన షాపింగ్ సంస్థలు ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు రీఫండ్ చేయడం మొదలుపెట్టాయి. దీన్ని అవకాశంగా భావించిన ఓ యువకుడు భారీ మోసానికి పాల్పడ్డాడు. ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల శివమ్ చోప్రా హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేశాడు. అయితే సరైన నైపుణ్యం, నిలకడ లేక అనేక ఉద్యోగాలు మారాడు. చివరికి ఎక్కడా కుదురుకోలేక ఖాళీగా ఉండడం మొదలుపెట్టాడు. ఈ సమయంలోనే అతని దృష్టి ఆన్ లైన్ షాపింగ్ స్టోర్ ల రీఫండ్ సదుపాయంపై పడింది. తన మోసాలకు దీన్ని అవకాశంగా మలుచుకోవాలని ప్లాన్ వేశాడు. ముందుగా ఈ ఏడాది మార్చిలో అమెజాన్ నుంచి రెండు ఫోన్లు ఆర్డర్ చేశాడు. ఆర్డర్ సరిగ్గానే వచ్చింది. ఫోన్లు తీసుకున్న శివమ్… ఆ తర్వాత తన నెంబర్ నుంచి అమెజాన్ కు ఫోన్ చేసి తనకు వచ్చిన పార్శిల్ ఖాళీగా ఉందని ఫిర్యాదుచేశాడు. ఆ విషయాన్ని నమ్మిన అమెజాన్ కంపెనీ పాలసీ ప్రకారం వెంటనే రీఫండ్ చేసింది. ఈ ప్లాన్ ఫలించడంతో శివమ్ వెంటవెంటనే దాన్ని అమలుచేయడం మొదలుపెట్టాడు.
యాపిల్, శామ్ సంగ్, వన్ ప్లస్ లాంటి ఖరీదైన ఫోన్లను ఆర్డర్ చేయడం, డెలివరీలో ఖాళీ బాక్సు వచ్చిందంటూ ఫిర్యాదుచేయడం, అమెజాన్ రీ ఫండ్ చేయడం… ఇలా రెండు నెలల పాటు సాగింది. ఈ స్వల్ప కాలవ్యవధిలో శివమ్ ఎన్నిసార్లు ఇలా అమెజాన్ ను బురిడీ కొట్టించాడో, ఎంత రాబట్టుకున్నాడో తెలిస్తే ఆశ్యర్యంతో నోళ్లు వెళ్లబట్టాల్సిందే. ఒకటీ, రెండు, పదీ, ఇరవై కాదు… ఏకంగా 166 సార్లు అమెజాన్ ను మోసం చేసి రూ.50 లక్షల రూపాయలు రాబట్టుకున్నాడు. ఇన్నిసార్లు అమెజాన్ ఎలా మోసపోయిందనే అనుమానం రావొచ్చు. అయితే అమెజాన్ కు సందేహం రాకుండా శివమ్ అనేక ఫోన్ నంబర్లు ఉపయోగించేవాడు. స్థానిక టెలికాం స్టోర్ యజమాని సచిన్ జైన్ ఒక్కడే శివమ్ కు 141 సిమ్ కార్డులు ఇచ్చాడు. ఒక్కో సిమ్ కార్డుకు రూ. 150 తీసుకుని వాటిని అక్రమంగా అందచేశాడు.
ఒక్కసారి శివమ్ ఒక్కో నంబర్ నుంచి కాల్ చేసేవాడు. అలాగే అడ్రస్ కూడా తప్పుగా ఇచ్చేవాడు. ప్రొడక్ట్ ను డెలివరీ చేయడానికి వచ్చే అమెజాన్ ప్రతినిధులు ఆ అడ్రస్ తెలియకపోవడంతో వారు ఆర్డర్ లో ఉన్న నంబర్ కు కాల్ చేసేవారు. అప్పుడు శివమ్ అడ్రస్ మారిందని, ఫలానా చోటుకు రావాలని చెప్పి, రెండు మూడు సందులు తిప్పించి డెలివరీ బాయ్ ను కలిసి ప్రొడక్ట్ తీసుకునేవాడు. వెంటనే తన రిజిస్టర్ నెంబర్ నుంచి ఫోన్ చేసి ఖాళీ డబ్బా ఇచ్చి వెళ్లారని ఫిర్యాదుచేసేవాడు. ఇలా అనేక సార్లు జరిగిన తర్వాత అమెజాన్ కు అనుమానం వచ్చింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. నెలల తరబడి కేసును ఛేదించి ఎట్టకేలకు శివమ్ చోప్రాను అరెస్ట్ చేశారు. అతనికి సిమ్ కార్డులందించిన సచిన్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 19 ఫోన్లు, రూ. 12లక్షల నగదు, 40 బ్యాంకు ఖాతాల పాస్ బుక్ లను స్వాధీనంచేసుకున్నారు. ఆర్డర్ లో వచ్చిన ఫోన్లను శివమ్ ఓఎల్ ఎక్స్ లేదా రీటెయిల్ మార్కెట్లో విక్రయించేవాడని పోలీసులు తెలిపారు.