ఎన్నికలు ముంచుకువస్తున్న తరుణంలో కూకట్ పల్లి నియోజకవర్గం నందమూరి కుటుంబ ప్రచారంతో కళకళలాడుతుంది. ఓవైపు నందమూరి కుటుంబం అంతా సుహాసినికి మద్దతుగా ప్రచారం చేస్తుంటే సుహాసిని మేనత్త , కేంద్ర మాజీమంత్రి, భాజపా నేత దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం ఆమెకి ఆశీసులు ఉంటాయంటూనే ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. నిన్న ఆమె కూకట్ పల్లి లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షో లో పాల్గొన్నారు. కూకట్‌పల్లి భాజపా అభ్యర్థి మాధవరం కాంతారావుకు మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని వసంతనగర్ నుంచి మూసాపేట్ వరకు నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నపాటి వర్షం కురిస్తేనే రోడ్లపై పడవలు వేసుకొని వెళ్ళే పరిస్థితి కూకట్‌పల్లిలో నెలకొందని విమర్శించారు. డ్రైనేజీలో నుంచి మురుగునీరు ఇళ్లల్లోకి ప్రవహిస్తోందన్న ఆమె.. ఇలాంటి పరిస్థితిని విశ్వనగరంలో ఏవిధంగా చూడాలని ప్రశ్నించారు.
భావసారూప్యత లేని పార్టీలన్నీ మహాకూటమి పేరుతో వచ్చాయని, తెదేపా, కాంగ్రెస్ ఎలా కలుస్తాయని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోదీని ఓడించాలనే ఈ పార్టీలన్నీ ఒకచోట చేరాయన్నారు. అవినీతిలేని పాలనను మోదీ ప్రజలకు అందిస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ, కాంగ్రెస్ఎలా కలుస్తాయని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుమార్తెగా కాంగ్రెస్ పార్టీలో చేరి.. పదేళ్లు మంత్రిగా ఉండి ఆ తర్వాత పార్టీ పని అయిపోయిందని తెలియగానే బీజేపీలో చేరిపోయి ఆ పార్టీ తరపున పోటీ చేస్తే లేని తప్పు కాంగ్రెస్- టీడీపీల పొత్తుతో ఎలా వచ్చిందో కానీ పురంధేశ్వరి .. బీజేపీ తరపున ప్రచారాన్ని మాత్రం నందమూరి అభిమానులు ఊహించలేకపోయారు. ప్రచారం మొదలు పెట్టక ముందు కోడలికి తన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పిన పురంధేశ్వరి కూకట్ పల్లి లో ప్రచారంలో చేస్తారా లేదా అని అంతా సందిగ్ధంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో పురందేశ్వరి బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది.