ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. వైసీపీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి దగ్గరుండి మరి జగన్ నివాసం లోటస్‌పాండ్‌కు వెంకటేశ్వరరావును, ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్‌ను తీసుకెళ్లారు. గత కొన్ని రోజులుగా దగ్గుబాటి పురందేశ్వరి బీజీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వెంకటేశ్వరరావు, జగన్‌తో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కుమారుడు హితేష్ చెంచురామ్‌తో కలిసి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆదివారం మధ్యాహ్నం జగన్‌ను కలిసి ఏపీ రాజకీయాలపై చర్చించారు. కుమారుడు హితేష్‌ను వైసీపీ నుంచి బరిలోకి దింపాలని ఈ మేరకు వారు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అమెరికా పౌరసత్వం ఉన్న హితేష్ రాజకీయాలపై ఆసక్తితో ఇక్కడే ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందుకే వైసీపీలో చేరుతున్నట్లు వైఎస్ జగన్ తో భేటీలో తెలిపారు. వెంకటేశ్వరరావు భార్య, స్వర్గీయ ఎన్టీఆర్ కూమార్తె పురందేశ్వరి బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే కుమారుడి రాజకీయ అరంగేట్రానికి తాను అడ్డంకి అయ్యే పరిస్థితుల్లో దగ్గుబాటి పురందేశ్వరి రాజకీయాల నుంచి తప్పుకుంటారని మంత్రి దగ్గుబాటి స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌తో భేటీ తర్వాత వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
జగన్‌ను కలిసేందుకు హితేష్ తో కలిసి వచ్చానని వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు మా కుమారుడు హితేష్ చెంచురామ్ నిర్ణయించుకున్నాడని తాము వైసీపీలో చేరి కలిసి పనిచేయబోతున్నందుకు వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారని టికెట్ ఎక్కడ నుంచి వస్తుందో తెలియదని, అన్ని విషయాలను పార్టీ నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. పురందేశ్వరి బీజేపీలో ఉన్నారని వైఎస్ జగన్‌కు చెప్పాను. కుటుంబం మొత్తం ఒకే పార్టీలో ఉండాలని లేదని కుమారుడు హితేష్ రాజకీయ భవిష్యత్తుకు తాను అడ్డంకిగా మారే పరిస్థితి తలెత్తినా ఎదుర్కోవడానికి పురందేశ్వరి సిద్ధంగా ఉన్నారని తప్పనిసరి అయితే ఆమె బీజేపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలగుతారు. అంతేకానీ వేరే పార్టీలో చేరరని దగ్గుబాటి వెంకటేశ్వరావు స్పష్టం చేశారు ఇదే సమయంలో హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌లో వికాస్ ఆగ్రోస్ వారి 21వ వార్షికోత్సవ కార్యక్రమానికి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాను వైసీపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని పార్టీ మారబోతున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె చెప్పారు. అంటే అమ్మ ఒక పార్టీ కొడుకు మరో పార్టీ, తండ్రి కాంగ్రెస్ పార్టీ అని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి హితేష్ పోటీ చేయబోతున్నారని సమాచారం. వెంకటేశ్వరరావు గతంలో పర్చూరు నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా కుమారుడిని అక్కడి నుంచే పోటీ చేపించాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం నుండి నామా దగ్గరి చుట్టం ఏలూరి సాంబశివ రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, అయితే ఆయన గెలుపుకు అప్పట్లో దగ్గుబాటి సహాయం చేశాడని చెప్పుకునే వారు, అయితే ఆ సంగతి ఎలా ఉన్నా ఇంకా పర్చూరులో దగ్గుబాటి వర్గం యాక్టివ్ గానే ఉందనేది అక్కడి వారు చెబుతున్న మాట. మరి ఈ ఎన్నికలకి అక్కడి ఎన్నిక మంచి రసవత్తరంగా మారుతుందనేది వాస్తవం.