నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం తెలంగాణా కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న పద్దతులని ఎండగట్టారు. గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను చేపట్టానని, హైదరాబాద్ మేయర్ గా కూడా పని చేశానని కాని అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు… పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఒకే సామాజికవర్గానికి ప్రమోషన్ లు ఇస్తున్నారనే విషయాన్ని నేరుగా ఆయనకే చెప్పానని…
దీంతో, అప్పటి హోం మంత్రి జానారెడ్డితో వైయస్ మాట్లాడుతూ, ఇలా చేస్తే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పారని గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ లో నేతల విషయంలో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో తనకు తెలియకుండానే ఎవరెవరికో అనామకులకి టికెట్లు ఇచ్చారని దానం ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ లో ఏ పార్టీ కార్యక్రమం జరిగినా సొంత ఇంటి బాధ్యతనంతా తన భుజాలపైనే వేసుకుని పని చేశానని అయినా తనను విస్మరించారని బీసీలకు ప్రాధాన్యత ఇస్తేనే కాంగ్రెస్ కు మళ్లీ పునర్వైభవం వస్తుందని పార్టీ అధినేత రాహుల్ గాంధీకి కూడా చెప్పానని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సమానత్వం లేదని బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కారణం వల్లే డీఎస్, కేకేలాంటి వాళ్లు పార్టీని వీడారని ఒకే వర్గానికి చెందిన వారు మాత్రమే పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని పరోక్షంగా రెడ్డి సామాజిక వర్గ నేతలని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శక్తివంచన లేకుండా పని చేస్తున్నా ఇతర నేతలు ఆయనను పీతల్లాగా కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నారని సీనియర్ నేత వీహెచ్ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆత్మాభిమానం చంపుకోలేకే కాంగ్రెస్ కు రాజీనామా చేశానని తెలిపారు. తాను ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటానని ఉత్తమ్ అనేకసార్లు చెప్పారని కానీ, పక్కన ఉన్నవారు ఆయనను అడ్డుకుంటున్నారని చెప్పారు.
వైయస్ లా పార్టీని కాపాడతానంటూ చెప్పగలిగే ధైర్యం కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడికైనా ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యే నిర్వహించిన బస్సు యాత్రపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకే బస్సుయాత్రలో ప్రాధాన్యముందని, మిగతా సామాజిక వర్గానికి చెందిన నేతలకు అందులో చోటు లేదని విమర్శించారు. తాను ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ… పార్టీ ప్రతిష్టను కాపాడేందుకే యత్నించానని దానం తెలిపారు. తనకు ఇంత కాలం అండగా ఉన్న పెద్దలందరికీ ఫోన్లు చేసి తాను పార్టీలో ఉండలేననే విషయాన్ని చెప్పానని అన్నారు.