కేటీఆర్ కి పాత మిత్రుడి లేఖ.

dasoju sravan wrote public letter to ktr about miyapur land scam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్, మియాపూర్ భూకుంభకోణం ప్రభావం తో కొన్ని ఐటీ కంపెనీలు భయపడుతున్నాయంటూ ఓ ఇంగ్లీష్ దినపత్రిక చేసిన రిపోర్టింగ్ మీద మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆయన సదరు పత్రిక మీద ఫైర్ అయ్యారు. అయితే ఆ పత్రిక ప్రతినిధికి అండగా ఒకప్పుడు కేటీఆర్ మిత్రుడు దాసోజు శ్రావణ్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ లో ఉంటున్న ఆయన ఈ వ్యవహారంలో కేటీఆర్ ని సవాల్ చేస్తూ ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ ప్రతిని మీరు కూడా చూడండి…

1. అయ్యా మీరు మా విచారణ లో బయట పడ్డదే మియాపూర్ ల్యాండ్ స్కాం అని అంటున్నారు . దీంట్లో ఉన్న అసలు మతలబు ఏంటి, పెద్ద చేపలు ఎవరు అంటే, అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

2. జయేష్ రంజన్, కేటీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ తాను ఎకనామిక్ టైమ్స్ పత్రిక కు ఇచ్చిన వివరణ లో స్పష్టం గా మియాపూర్ భూములలోనే కాదు, అనేక చోట్ల భూ సంబంధిత సమస్యలు ఉన్నాయని ఒప్పుకున్నారు .

3. ఎకనామిక్ టైమ్స్ పత్రిక అదే విషయాన్ని రాసింది. కానీ ఉన్న మాటంటే ఉలిక్కి పడ్డట్లు , కేటీఆర్ గారికి కోపం వచ్చి , పత్రికను, ఆ ఆర్టికల్ రాసిన జర్నలిస్ట్ సుకుమార్ మీద మీద దండయాత్ర చేసిండు.

4. సుకుమార్ రాసిన అంశాలన్నీ తప్పు అయితే రిజాయిన్డెర్ ఇచ్చిన జయేష్ మాటలు కూడా తప్పా?

5. ప్రభుత్వం 14వ ఫైనాన్స్ కమీషన్ కు ఇచ్చిన రిపోర్ట్ లోనే తెలంగాణ ఏర్పడ్డంక కొన్ని కంపనీలు తరలి పోయాయి అని రాసింది నిజం కాదా? అదే మాట సుకుమార్ రాసిండు, మరి అంత ఎందుకు ఉలికిపాటు?

5. మంత్రి మాటల్లో, ఐఏఎస్ ఆఫీసర్ మాటల్లో వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయి? ఎవరిది నిజం? ఎవరిది అబద్దం?

6. మియాపూర్ ఉదంతం పొక్కగానే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆఘమేఘాల మీద 70+ సబ్ – రెజిస్ట్రార్లను బదిలీ చేసి, తరువాత ఏం నష్టం జరుగలేడు అని దొంగలకు వత్తాసు పలికింది నిజం కాదా?

7. ముఖ్యమంత్రి ప్రకటనను మాత్రమే ఆధారంగా చేసుకుని నిందితులకు ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది నిజం కాదా?

8. తప్పులే జరగక పోతే రాజ్య సభ సభ్యుడు కేకే గారు తన భూములను ఎందుకు వదులుకున్నాడు?

9. మరి రాజ్య సభ సభ్యుడు డి శ్రీనివాస్ పై చర్యలేవి?

10. అసలు గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎక్కడ? తెలంగాణ పోలీసులకు దొరకట్లేదా? ఎవరు గోల్డ్ స్టోన్ ప్రసాద్ ను కాపాడుతున్నారు? విజయ మాల్యా ను తప్పించినట్లే, ఆయన్ని కూడా విదేశాలకు పంపించారా?

11. కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి పై చర్య లేవి?

12. కెసిఆర్ గారి ఆత్మ బంధువు నమస్తే తెలంగాణా అధినేత దామోదర్ రావు పై చర్యలేవి?

13. ప్రగతి భవన్ వేదికగా తప్పు జరిగినట్లు వార్తలోచ్సాయి. అసలు పెద్ద చేపలు ఎవరు?

14. తెలంగాణ ఉద్యమ కాలం లో భూ కబ్జా లకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినం.

15. తెలంగాణ వచ్చినంక ఎమ్మార్ భూ కుంభ కోణం పై చర్యలేవి? వారిపై విచారణ లేకుండా దొంగలకు వత్తాసు పలుకుతూ కోర్టులలో పిటిషన్లు ఎందుకు దాఖలు చేసిండ్రు?

16. రహేజాకు సంభందించిన వ్యవహారం లో తెలంగాణ ప్రభుత్వమే కోర్టులను తప్పు తోవ పట్టిస్తున్నట్లు వస్తున్న వార్తలలో నిజమెంత?

17.సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ లో జరిగిన భూ ఆక్రమణ కేసు ఏమైంది? కేటీఆర్ మిత్రుడు కాబట్టి, జిహెచ్ఏంసి ఎన్నికలలో ప్రచారం చేసినందుకు తెరాస ఇచ్చిన బహుమానమా? అయ్యప్ప సొసైటీ లో ఉన్న మధ్య తరగతి వాళ్ళ ఇళ్లను మాత్రం కూల్చిండ్రు.

18. మూడు ఏళ్ళైనా అన్యాక్రాంతమైన ఒక్క అంగుళం భూమిని ఎందుకు వెనక్కి తేలేక పోయారు?

19. వక్ఫ్ బోర్డు లో నిజాయితీగా పనిచేస్తు, భూ కబ్జాకోరుల పాలిటి సింహ స్వప్నమైన ఐ పి యస్ అధికారి ఇక్బాల్ ని ఎందుకు బదిలీ చేసిండ్రు?

20.మూడేళ్లయినా వక్ఫ్ బోర్డుకు జ్యూడిషల్ అథారిటీ చేస్తానని తెరాస మేనిఫెస్టో లొ చేప్పిన వాగ్దానం ఎందుకు అమలు చెయ్యట్లేదు?

21. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోఅమలు లో ఉన్న భూ ఆక్రమణ పరిరక్షణ చట్టాన్ని ఎందుకు రద్దు చేసినట్లు? ఎవరికి లాభం కల్గుతుందని ఈ చర్యలు? ఆ చట్టం ఉండి ఉంటే, ఎమ్మార్ లో మాదిరిగా, మియాపూర్ భూ ఆక్రమణ దారులకు ఇప్పటికి బెయిల్లు రాక, జైళ్ల లో ఉండే వారు కాదా?

22. ఆఖరికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరిని వదిలిపెట్టలేదు. తెలంగాణ వచ్చినంక దొంగల అడుగులకు మడుగులు వత్తుతున్నారు. ఎమ్మార్ లాంటి విషయం లో జైళ్ళ కు పోయున వారికి మ్యుటేషన్ కింగ్ లుగా పెరొంది, భూ ఆక్రమణలకు తోడ్పడ్డ అధికార బృందానికి, కేటీఆర్ గారు ఏ లాలూచీతో పెద్ద పెద్ద పదవులు ఎందుకు కట్టపెట్టిండు?

23. 111 జి ఓ ఎత్తి వేయకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ ను తప్పుదోవ పట్టిస్తూ, వందల ఎకరాల భూ దందాలకు పాల్పడుతూ, ఎకరాల కొద్దీ భూములలో తాజ్ మహల్ల లాంటి బంగళాలు కట్టుకుంటుంది ప్రభుత్వ పెద్దలు కారా?

23. ఎకనామిక్ టైమ్స్ సుకుమార్ గత 30 ఏళ్లకు పైబడి నాకు తెలుసు. హైదరాబాద్ సెంట్రల్ యూనివెర్సిటీ లో ఏంఏ ఫిలాసఫీ చదివి, ఎంఫిల్ కూడా చేసాడు. దేశంలోనే ప్రధమ స్థాయిలో నిలబడి కామన్వెల్త్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ పొందిన ఉత్తమ విద్య పరిశోధకుడు కూడా.

24. విద్యార్థి దశలో వామపక్ష ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ, ప్రస్తుతం తనకంటూ ఒక సిద్ధాంతంతో విలువలతో జీవితం గడిపే ఒక మధ్య తరగతి జర్నలిస్ట్ సుకుమార్.

25. ఉద్యమాల గడ్డ వరంగల్లు జిల్లా కు చెందిన జనగామలో, రెడ్డి కులం లో పుట్టినప్పటికిని, అంబెడ్కర్ ఆలోచనల స్పూర్తితో తన పేరు చివర ఉన్న రెడ్డి ని తీసివేసిన వ్యక్తి సుకుమార్.

26. కఠిన నిజం ఎప్పడు చెదే. నిజాన్ని జీర్ణించుకోలేక, బట్ట కాల్చి మీద వేసినట్లు, సుకుమార్ ను అనరాని మాటలంటూ, అవినీతి పరుడు అని, అమ్ముడు పోయిండు అని తప్పుడు రాతలు రాయడమే గాక, అదేదో గొప్ప పని అన్నట్లు స్వంత బాకా పత్రికలలో ప్రచురించుకోవడం న్యాయమా? అధికారం లోకి వచ్చిన తర్వాత అమ్మడం, కొనడం బాగా అలవాటై అందరిని తమ లెక్కనే అనుకుంటే పొరపాటే.

27. కేటీఆర్ దృష్టిలో ఇవ్వాళ అవినీతి పరుడు అని బిరుదు పొందిన సుకుమార్, కేటీఆర్ కు తెలుసో లేదో నాకు తెలియదు కాని, తెలంగాణ ఉద్యమ కాలంలో ఆనాటి ఉద్యమ నేత కెసిఆర్ ను తన ఫార్మ్ హౌస్ లో కలిసి ఆయన ఇంటర్వ్యూలను జాతీయ స్థాయిలో పతాక శీర్షికన ప్రచురించింది నిజం. ఒకటి కాదు ఎన్నో మార్లు ఆర్టికల్స్ రాసిండు. ఆనాడు ఉద్యమానికి మద్దతు కలిగెలా రాసింది నిజం, ఇవ్వాళ అధికారం వచ్చినంక తెరాస తప్పొప్పులను ఎండగడుతుంది నిజం. అయితే నిజం నిప్పు లాంటిది. తప్పు చేసిన వాళ్లను ఒక రోజు అయినా కాల్చక మానదు.

28. మీకు బాజా గొడితే మంచి వాళ్ళు, లేక పోతే తెలంగాణ ద్రోహులు అని ముద్ర వేయడం, తెరాస పెద్దల భావ దారిద్ర్యానికి ప్రతీక. వారికున్న తప్పుడు అలవాటు.

30. రాజకీయాన్ని వ్యాపారం గా పరాకాష్టకు తీసుకెళ్లిన చరిత్ర తెరాసది . ఉద్యమ లక్ష్యాలకు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ పేరు మీద తెరాస పెద్దలు ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులను బ్లాక్ మెయిల్ చేసి, కాంట్రాక్టులు, డబ్బు సంచులతో కొన్న అలవాటు, ఆఖరికి జర్నలిస్టులకు అదే వ్యాపార జబ్బు ఉంటుంది అనుకోవడం మూర్ఖత్వం.

31. చాలా పత్రికలు, చానెళ్లు ఈ భూ కబ్జా వార్తలు రాశాయి. ఒక్క ఎకనామిక్ టైమ్స్, ఒక్క సుకుమార్ మాత్రమే ఈ వార్తలు రాయలేదు. బిజినెస్ పేపర్ కాబట్టి వ్యాపార సంస్థల కోణం రాయవచ్చు. అంత మాత్రాన అన్ని అబాండాలు వేయాలా? ప్రభుత్వానికి అమ్ముడు పోలేదని ఆక్రోశమా?

32. తెలంగాణ సెంటిమెంటు ముసుగు లో గతం లో ఆంధ్రజ్యోతి, ఎబిఎన్, టీవీ 9 పై ఆధిపత్య అహంకారం తో దాడి చేసి, వాళ్ళపై అణచివేత కు పాల్పడ్డారు.

33. ఇవాళ తెలంగాణ ఏ మీడియా హౌస్ కూడా స్వేచ్ఛగా పనిచేయట్లేదు. తెరాస పెద్దల బ్లాక్ మెయిల్ కు గురిఅవుతూ నానా ఇబ్బందులకు గురి అవుతున్నారు. అమ్ముడు పోండి, లేదా అణగిమణగి ఉండండి అన్నట్లుంది తెరాస వ్యవహారం

34. హైదరాబాద్ ప్రతిష్ట అంటూ, తెలంగాణ సెంటిమెంటును అడ్డంబెట్టుకొని చడి చప్పుడు గాకుండా దొంగలు దొంగలు దేశాలు పంచుకున్నట్లు దోచుకు తింటాం అంటే, చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఊరుకోదు. నిలదీస్తది, ప్రశ్నిస్తది. ఆ ప్రశ్నే ప్రజాస్వామ్యానికి రక్ష.

35. తెరాస పెద్దలకు పాలకులకు, ప్రజలకు తేడా తెలియనట్లుంది. ప్రజలు ప్రశ్నిస్తారు, పాలకులు సంమయనంతో సమాధానం చెప్పాలి. కాని అక్కసుతో దాడి చేయడం నేరం. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.

36. కేటీఆర్ వాఖ్యలు ముమ్మాటికీ పత్రిక స్వేచ్ఛ పై దాడి. బెదిరంపు బ్లాక్ మెయిల్ తో కూడుకున్న ఆధిపత్య రాజకీయాల కొనసాగింపే ! భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాయడమే ! ఇకనైనా ప్రజాస్వామ్యానికి నాల్గొ స్తంభమైన తెలంగాణ మీడియా ఏకం కావాలి. ప్రభుత్వ ఆధిపత్య దురాగతాలను ఎదిరించాలి.

37. తెలంగాణ కు భావి ముఖ్యమంత్రి కావాలని కలలు గనే కేటీఆర్, అయన ప్రస్తుత ఆలోచనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి, ప్రమాదం చేకూర్చేల ఉన్నాయి. రానున్న నిరంకుశత్వ పాలన సూచికలు కళ్ళకు కట్టినట్లు ఇప్పుడే చూపెడుతున్నాడు.

38. తెలంగాణ సోయి కేవలం తెరాస లో ఉన్న వాళ్లకు మాత్రమే గాదు, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడికి తెలంగాణ ప్రజాస్వామ్య బద్దం గా బాగుపడాలని కోరుకుందన్న విషయం తెరాస పెద్దలు తెలుసుకోవాలి.

38. ప్రభుత్వానికి దమ్ముంటే, భూ ఆక్రమణలపై బహిరంగ చర్చకు రండి. సి బి ఐ విచారణ జరిపించండి అధికారులు, కాంగ్రెస్ కు చెందిన వారితో సహా ఏ పార్టీకి చెందిన వారినైనా, ఎంతటి వారినైనా వదిలిపెట్టకండి.

39. మ్యుటేషన్ కింగ్ లను, జైళ్ళ లో మగ్గిన ఆఫీసర్లను తొలగించండి.

40. చివరిగా ఎకనామిక్ టైమ్స్ సుకుమార్ రాసింది అబద్దమైతే, జయేష్ రంజన్ రాసిన వివరణ బహిర్గతం చేయండి.

ఇట్లు
డా శ్రవణ్ దాసోజు
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్

 మరిన్ని వార్తలు 

కెసిఆర్ ఆరోగ్యం గుట్టు విప్పిన మనవడు.

ఎకనమిక్ టైమ్స్ ను ఎక్కేసిన కేటీఆర్