తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఓ వైపు టీఆర్‌ఎస్, బీజేపీ లాంటి పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంటే వారని దెబ్బ కొట్టడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటయిన కూటమి పార్టీలు మాత్రం సీట్ల సర్దుబాటు చర్చల దగ్గరే ఆగిపోయాయి. అయితే కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఈ ఆలస్యం వెనుక వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది.
తాజాగా గాంధీభవన్ లో ఆయన రాజ్యసభ సభ్యుడు నజీర్ హుస్సేన్ మరికొందరు నేతలతో కలిసి విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించపోతున్నారని చెప్పారు. అసమ్మతులు అనేవి అన్ని పార్టీల్లో సహజమనీ, తమ పార్టీలో కూడా ఉన్నాయని, అవి త్వరలో సమసిపోతాయని తెలిపారు. టీఆర్‌ఎస్ వైఫల్యాలపై త్వరలో చార్జిషీట్ కూడా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
సీట్ల ప్రకటన ఆలస్యం రాజకీయ వ్యూహంలో భాగమని రాజీవ్ శుక్లా అన్నారు. పొత్తులు ఉన్నప్పుడు ఇలాంటి వ్యూహాలు సాధారణమేనని, కాంగ్రెస్ గెలవబోతోంది కాబట్టే ఎక్కువమంది సీట్లను ఆశిస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ సర్వేల ప్రకారం తెలంగాణలో మహాకూటమి 80 సీట్లను కైవసం చేసుకుంటుందని అన్నారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ అబద్ధాలకోరులేనని విమర్శించారు. రాష్ట్రంలో 4000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి, ప్రైవేట్ పాఠశాలలకు కేసీఆర్ లబ్ది చేకూర్చారని ఆరోపించారు.