2019 ఎన్నికల్లో బీజేపీని ఎలా అయినా ఇంటికి పంపేందుకు బీజేపీయేతర శక్తులు అన్నీ ఏకమవుతున్నాయి. అవసరమైతే మిత్రపక్షాల అభ్యర్థిని ప్రధానిని చేసేందుకు కూడా తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ తేల్చడంతో ఇప్పుడు మిత్రపక్షాల పీఎం అభ్యర్ధి ఎవరు అనే విషయం మీద చర్చ మొదలయ్యింది. దాంతో తెరమీదకి ఎన్నో పేర్లు వస్తున్నాయి అందులో మమత పేరు ముందుంది. చంద్రబాబు, దేవెగౌడ వంటి వారి పేర్లను ప్రస్తావిస్తున్నా వారు మాత్రం అందుకు సుముఖంగా లేము అనే సంకేతాలని పంపడంతో ఇప్పుడు మమత మాయావతి వంటి వారి పేర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయం మీద మాజీ ప్రధాని దేవేగౌడ స్పందించారు.
విపక్షాల తరపున ప్రధాని అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నిలబెడితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎందకంటే బీజేపీని అధికారానికి దూరం చేసే క్రమంలో, విపక్ష పార్టీలను ఏకం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని అదే విధంగా మూడో ఫ్రంట్ ను ఏర్పాటు చేసే క్రమంలో మమత తన శక్తి మేరకు పని చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రధాని అభ్యర్థిగా విపక్షాలు మమతా బెనర్జీని ఎన్నుకోవడాన్ని పూర్తిగా స్వాగతిస్తామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మైనారిటీలు అభద్రతా భావంతో ఉన్నారనీ, దేశంలో భయానక వాతావరణం ఉందని ఆరోపించారు. 2019లో బీజేపీని ఓడించాలంటే ఓ బలమైన కూటమి ఉండాల్సిందేనన్నారు. సాధారణ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌తో కలిసే తమ పార్టీ పోటీ చేస్తుందని దేవెగౌడ ప్రకటించారు.