ఏదైనా ఒకమాట అంటున్నారంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, రాజకీయాల్లో ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి లేదంటే పరువు పోగొట్టుకోవడం ఖాయం. తాజాగా ఇలాంటి ప్రకటనే ఒకటి చేసి పరువు తీసుకున్నారు ఏపీ ప్రతిపక్ష పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న నేత. వివరాల్లోకి వెళితే ఆంద్ర ప్రదేశ్ మాజీ డిజిపి వైకాపాలో చేరారని వార్తలు వచ్చాయి. విశాఖ జిల్లాలో పాదయాత్రలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు.ఆ వెంటనే ఆయన తమ పార్టీలో చేరుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.
సాంబశివరావు చేరికతో వైసీపీకి అదనపు బలం వచ్చిందని చెప్పారు. ఆయన సలహాలు తీసుకుని రానున్న ఎన్నికలను వైసీపీ సమర్థంగా ఎదుర్కొంటుందని చెప్పారు. ఈ దెబ్బకి సాంబశివరావు తొలుత జనసేనలో చేరాలనుకున్నారని.. ఆ పార్టీ స్పందించకపోవడంతో వైసీపీ వైపు మొగ్గుచూపారని… సాయిరెడ్డితో చాలాకాలంగా ఆయన టచ్‌లో ఉన్నారని ఇలా రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో సాంబశివరావు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్‌ను తాను కలవడం వెనుక ఎటువంటి
రాజకీయాలకు తావు లేదని కేవలం గంగవరం పోర్టు సీఈవో హోదాలో మర్యాదపూర్వకంగా మాత్రమే జగన్‌ను కలిశానని తెలిపారు. ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని వెల్లడించారు. దీంతో అసలు ఏమీ లేకుండానే పార్టీలో చేరుతున్నారని ప్రకటించి విజయసాయి రెడ్డి పరువు పోగొట్టుకున్నారు.