ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. వాటిలో మిక్సీలు, వాచీలు, సైకిళ్లు ఫ్రీగా అందిస్తామని కొన్ని రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తే, ల్యాప్ టాప్ లు, టీవీలు ఫ్రీగా ఇస్తామని మరికొన్ని పార్టీలు ప్రజలకు ఆశపెడతాయి. ఎమ్మెల్యే క్యాండిడేట్ లు సైతం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రూ.500 నుంచి రూ.2,000 వరకూ చెల్లిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రలోభాలను నియంత్రించేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో అభ్యర్థులు కొత్తదారి కనిబెట్టారు. డబ్బులు, మద్యం తీసుకెళుతుంటే ఈసీ అధికారులు, పోలీసులు పట్టుకుంటున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు కొత్త రూట్ ను ఎంచుకున్నారు.
ఎన్నికల్లో డిజిటల్ మంత్రా ఓటు వేయటానికి బ్యాలెట్ పేపర్లు పోయి ఈవీఎం లు వచ్చాయి. ప్రచారానికి సోషల్ మీడియా వాడేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పెయిడ్ కార్యకర్తలకు పేమెంట్ చేయటానికి డిజిటల్ వ్యాలెట్లు, యాప్‌లను వినియోగిస్తున్నారు. అందులో పేటీఎం, గూగుల్ పేలు ముఖ్యమైనవి ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్న నేపథ్యంలో రాజకీయ నేతలు పగటి పూట ఓటర్ల ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారు. అనంతరం రాత్రిపూట గుట్టుగా వాళ్ల పేటీఎం వ్యాలెట్ కు బదిలీ చేస్తున్నారు. ఇందుకోసం నేతలు ప్రత్యేకంగా కొందరు సిబ్బందిని సైతం నియమించుకున్నారు. వీరిలో కూలీలను మినహియిస్తే మిగతా వారికి నేరుగా డబ్బులు ఇవ్వకుండా అర్దరాత్రి దాటిన తర్వాత పేటీఎం ద్వారా పంపిస్తున్నారు. ఉదయమే వచ్చిన వారి పేర్లను నమోదు చేసుకొని, వారి పేటీఎం నంబర్ తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ రకంగా ఈసీకి చిక్కకుండా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. టెక్నాలజీ మాయ మరి !