Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడులో రాజకీయం అంతకంతకు రసవత్తరంగా మారుతోంది. పళనిస్వామి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఎప్పుడైనా పళని సర్కార్ పడిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. పళనిస్వామి పరిస్థితిని ఆసరాగా తీసుకుని రాజకీయంగా బలపడదామని చూస్తున్న పన్నీర్ సెల్వం కి జరుగుతున్న పరిణామాలు మింగుడు పడడం లేదు. ఇలా పోటీదారులిద్దరికీ మంట పుట్టేలా చేస్తోంది ఎవరో కాదు. శశికళ మేనల్లుడు దినకరన్. జయ మరణం, ఆ తర్వాత రాజకీయ సంక్షోభ సమయంలో దినకరన్ ని ఎవరూ పట్టించుకోలేదు. శశికళ ఇక తనకి జైలు జీవితం తప్పదని తెలిసి పార్టీ కి దూరంగా వున్న దినకరన్ ని పిలిచి కొత్త బాధ్యతలు ఇచ్చింది. జయ కాదన్న మనిషికి శశి పెద్దపీట వేయడాన్ని చాలా మంది తప్పుబట్టారు. ఇక ఆర్కే నగర్ ఉప ఎన్నికల టైం లో ధన ప్రవాహం, ఎన్నికల సంఘాన్ని ప్రలోభపెట్టబోయి జైలుపాలు కావడం వంటి పరిణామాలతో దినకరన్ ప్రతిష్ట పూర్తిగా దెబ్బ తింది. ఏ గవర్నమెంట్ ఏర్పాటుకు దినకరన్ ప్రయత్నించాడో అదే సర్కార్ ఆయన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. పార్టీకి కూడా దూరం చేసింది.
అప్పటి పరిణామాలు చూసిన ఏ ఒక్కరు దినకరన్ తిరిగి రాజకీయాల్లో ప్రభావం చూపిస్తాడు అనుకోలేదు. కనీసం అతన్ని పలకరించే దిక్కు వుండదనుకున్నారు. కానీ ఎప్పుడైతే జైలుకెళ్లి బెయిల్ మీద బయటికి వచ్చాడో దినకరన్ ఫేట్ మారిపోయింది. ఎప్పటినుంచో శశికళ అండ్ టీం ని బద్ధశత్రువులా చూస్తున్న మోడీ సర్కార్ రూట్ మారింది. రాష్ట్రపతి ఎన్నికల దృష్టితో దినకరన్ తో బీజేపీ నేతలు ఢిల్లీలో చర్చలు జరిపిన విషయం బహిరంగ రహస్యమే. పళనిస్వామి, పన్నీర్ సెల్వం కన్నా దినకరన్ అయితేనే అన్నాడీఎంకే శ్రేణుల్ని కదిలించగలడని బీజేపీ ఎప్పుడైతే నమ్మిందో అప్పుడే దినకరన్ మీద ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో క్రేజ్ పెరిగింది. ఏ పదవి లేకున్నా దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు దినకరన్ తో జట్టు కట్టి రాజకీయంగా ఆయన ఏమి చేయమంటే అది చేయడానికి సిద్ధంగా వున్నారు. ఆ బలం తో తేలిగ్గా పళనిస్వామి సర్కార్ ని దినకరన్ పడగొట్టగలరు. ఈ పరిణామాలు చూస్తుంటే జైలుకెళ్ళొచ్చాకే దినకరన్ క్రేజ్ పెరిగింది అనుకోవాలి. ఇది కలికాలం మహిమో… నేటి రాజకీయాలకు దర్పణమో?