బాలీవుడ్లో అమీర్ ఖాన్ నటించిన ‘గజిని’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని 100 కోట్లు వసూళ్లు చేయడం అప్పట్లో సంచలన విజయంగా చెప్పుకోవచ్చు. ఆ చిత్రం తర్వాత అదే అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘త్రి ఇడియట్స్’. ఆ చిత్రంలో ముగ్గురు స్నేహితుల గురించి దర్శకుడు అద్బుతంగా చూపించాడు. జీవితంలో చదువు ముఖ్యం కాని, జీవితం మొత్తం చదువు కాదు అంటూ మంచి సందేశంను దర్శకుడు ఇచ్చాడు. ఆ సినిమాను సౌత్‌లో శంకర్ రీమేక్ చేయడం జరిగింది. విజయ్ ప్రధాన హీరోగా నటించిన ‘స్నేహితులు’ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. తెలుగులో కూడా పెద్దగా మెప్పించలేదు. బాలీవుడ్లో మొదటి 200 కోట్ల చిత్రంగా ఆ చిత్రం రికార్డులు సృష్టించింది.
బాలీవుడ్లో 200 కోట్ల క్లబ్లో స్థానం దక్కించుకున్న మొదటి సినిమా అయిన ‘త్రి ఇడియట్స్’కు సీక్వెల్ చేసేందుకు దర్శకుడు హిరానీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ బయోపిక్‌ను విడుదల చేసే పనిలో ఉన్న దర్శకుడు హిరానీ త్వరలోనే ఇడియట్స్ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నాడు. అదే కథకు కొనసాగింపుగా సినిమా ఉంటుందని సమాచారం అందుతుంది. సంజు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో తన తదుపరి చిత్రం గురించి ప్రకటించిన హిరానీ 3 ఇడియట్స్పై క్లారిటీ ఇచ్చాడు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా సీక్వెల్‌కు చాలా ఆసక్తిగా ఉన్నాడు అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు. సీక్వెల్ వస్తే ఖచ్చితంగా అది మరో సంచలన విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.