ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు ప్లాపులు…అలాంటి ఇలాంటి ప్లాపులు కూడా కాదు…సినిమా నిర్మించిన నిర్మాతలు…కొన్న డిస్ట్రిబ్యూటర్లు నెత్తిన తడిగుడ్డ వేసుకునేంత భారీ ప్లాపులు ఇచ్చాక ఏ దర్శకుడినైనా ఎవరు నమ్మి అవకాశం ఇస్తారు. శ్రీను వైట్ల ప్రస్తుత పరిస్థితి కూడా ఇంతకంటే ధీనం అని చెప్పొచ్చు. మహేష్ బాబు కు దూకుడు అనే సినిమాతో బ్లాక్ బస్టర్ బొమ్మ ఇచ్చాక వచ్చిన గర్వం వాళ్ళ కాబోలు ఆ తరువాత జూ. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేక బాద్షా అనే యావరేజ్ బొమ్మ తో మమ అనిపించేశాడు. అందులో కాస్త కామెడీ వర్కౌట్ అవ్వడం వల్ల కాబోలు, జూ. ఎన్టీఆర్ చరిష్మా కూడా సహకరించి, సినిమాకి పెట్టిన పెట్టుబడి అయినా వెనక్కి రాబట్టింది. ఆ సినిమా తరువాత వెంకీ నుండి దూకుడు వరకు తనతో కలిసి ప్రయాణం చేస్తున్న రైటర్ కోన వెంకట్ తో విభేదాలు పెట్టుకొని, అవి ఎలాంటివి అంటే కోన వెంకట్ రాసిన కథ కి నేను మెరుగులు అద్దడం వలనే సినిమాలు హిట్ అయ్యాయని, కాదు నా కథలు యథాతథంగా వాడుకోకపోవడం వలెనే కొన్ని సినిమాలు ప్లాపులు అయ్యాయని ఇద్దరూ బహిరంగంగానే దూషణలకు పాల్పడ్డారు.
ఇక అంతే, కోన వెంకట్ లేకుండా హిట్ కొడతానని ప్రకటించి, మహేష్ బాబు తో ఆగడు అనే సినిమా తీసి, మహేష్ బాబు కి సైనికుడు తరువాత అంతటి కనీవినీ ఎరుగని అట్టర్ ప్లాఫ్ ఇచ్చి, మరోసారి మహేష్ బాబు ని కలిసి, కథ వినిపించే అవకాశం కూడా ఇవ్వలేనంతగా భయపెట్టాడు. ఈ సినిమా పరాజయం తో కోన వెంకట్ సంతోషపడినా, కోన వెంకట్ కి రైటర్ గా గీతాంజలి తరువాత ఎటువంటి హిట్ పడకపోవడంతో తన నిలకడకు ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.ఇది సరిపోదన్నట్లు ప్రకాష్ రాజ్ తో గొడవ కూడా పెట్టుకొని, జన్మలో ఇక అతనితో సినిమా తీయమని శపథం కూడా చేసేశాడు శ్రీను వైట్ల. ఈ విషయంలో శ్రీను వైట్ల కి, ప్రకాష్ రాజ్ కి కొన్ని రోజుల వరకు మీడియా సాక్షిగా ఒకరికి ఒకరు బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఇలా శ్రీను వైట్ల, కోన వెంకట్ వేరుగా ఉంటే ఎవ్వరికీ ప్రయోజనం ఉండదని ఈ ఇద్దరిని కలిపి బాధ్యత రామ్ చరణ్ తీసుకొని, వారిద్దరితో బ్రూస్ లీ అనే సినిమా తీసినా, అది కూడా ఘోర పరాజయం మూటగట్టుకోవడం, సినిమా పరాజయానికి కారణంగా ఒకరిని ఇంకొకరు తప్పుపట్టడం తో రామ్ చరణ్ కూడా తనకు దక్కిన ప్లాపుతో సరిపెట్టుకొని సైడ్ అయిపోయినా, యువ హీరోలతో ఖచ్చితంగా హిట్ ఇవ్వగలడేమో అని భావించి, మరో మెగా హీరో వరుణ్ తేజ్ తో సినిమా ఇప్పించాడు.
ఈ సినిమాతో వరుణ్ తేజ్ సినిమా కథల ఎంపిక విషయంలో మరో పదేళ్లు భయపడేంత భారీ ప్లాపుని ఇచ్చి, మెగా కాంపౌండ్ గేట్ దాటి లోపలికి వెళ్లే అవకాశం కూడా దూరం చేసుకున్నాడు శ్రీను వైట్ల. చివరికి తిరగగా, తిరగగా తనతో మూడు సినిమాలు చేసిన మిత్రుడు రవితేజ ని కలిసి, ఈసారి ఎలాగైనా హిట్ బొమ్మ తీస్తానని ఆశపెట్టి, బ్లాక్ బస్టర్ సినిమాలతో పెద్ద నిర్మాణ సంస్థగా ఎదుగుతున్న మైత్రి మూవీ మేకర్స్ ని తన తెలివితేటలతో నమ్మించి, అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాని తీస్తే, ఈ సినిమా కూడా రిలీజ్ అయిన రోజున మొదటి ఆట కే అట్టర్ ప్లాపు టాక్ తెచ్చుకోవడంతో, ఇక ఏ హీరో కూడా శ్రీను వైట్ల ని నమ్మి అవకాశం ఇచ్చే పరిస్థితిని దాటిపోయి, తన కెరీర్ కి ముగింపు పలకాల్సిన అగాథంలో పడిపోయాడు. ఈ సినిమాకి కొత్త రచయితలతో పనిచేసినా, మూస రివెంజ్ స్టోరీ కి, అస్సలు పొసగని ఏదో పాయింట్ జతచేసి, సినిమాని మొత్తం కంగాళీ చేసి, మా రవితేజ కి ఇంత ప్లాపు బొమ్మ ఇస్తావా అని రవితేజ అభిమానులు తిట్టిన తిట్టు తిట్టకుండా హెచ్చరికలు చేస్తుండడంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు శ్రీను వైట్ల. మరోవైపు ఖైదీ నెం. 150 తో చిరంజీవి కమ్ బ్యాక్ సినిమాని తీసి, భారీ హిట్టు కొట్టిన వి. వి. వినాయక్ ఇంటెలిజెంట్ అనే ప్లాపు సినిమా ఇచ్చినందుకు ఒక్కరు కూడా సినిమా అవకాశం ఇవ్వకపోతుండడం, వినాయక్ ఔట్ డేటెడ్ అంటూ కామెంట్లు ఎదుర్కుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో, శ్రీను వైట్ల కి మరో అవకాశం రావడం అసాధ్యం అని తెలుస్తుంది. ఇక శ్రీను వైట్ల తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే అంటున్నారు తెలుగు సినిమాభిమానులు.