ప్రపంచకప్‌లో భాగంగా భారత్ తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్ నుంచి వింత ప్రతిపాదన ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా 89 పరుగుల తేడాతో పాక్‌ని చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో తుది జట్టు ఎంపిక నుంచి బ్యాటింగ్ ఆర్డర్లో అనూహ్య మార్పులు చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పట్టుదలతో 48వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచి టీమ్‌కి 336 పరుగుల మెరుగైన స్కోరు అందించాడు. ఆ తర్వాత పాక్ ఆటతీరుకి అనుగుణంగా బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ కూర్పులు చేసిన విరాట్ కోహ్లీ కెప్టెన్‌గానూ సక్సెస్ అయ్యాడు. మరోవైపు పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పేలవ కెప్టెన్సీతో ఆ జట్టు ఓటమికి కారణమయ్యాడు. దీంతో ఇప్పుడు ‘మాకు కాశ్మీర్ వద్దు.. విరాట్ కోహ్లీని ఇవ్వండి’ అని పాకిస్థాన్ అభిమానులు వింత ప్రతిపాదనని తెరపైకి తీసుకొస్తున్నారు. వికెట్ల వెనుక బద్ధకంతో సర్ఫరాజ్ ఆవలిస్తున్న తరుణంలో.. వికెట్ల మధ్య విరాట్ కోహ్లీ గంటకి 25కిమీ వేగంతో పరుగులు తీసిన విషయం తెలిసిందే.