గత కొన్ని వారాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్నా చితక చిత్రాలు ఆకట్టుకోకుంటా పోయాయి. తాజాగా ఈ వారం ఏకంగా అరడజను చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిల్లో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. ఈ చిత్రంపై అన్ని వర్గాల ప్రేక్షకులు భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. కాని చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ అద్బుతాన్ని ఆవిష్కరిస్తాడని భావిస్తే ఆయన సాదా సీదాగానే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఆ తర్వాత ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘శంభో శంకర’. జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెల్సిందే.
టాలీవుడ్లో ఎంతో మంది కమెడియన్స్ హీరోలుగా తెరంగేట్రం చేసిన విషయం తెల్సిందే. అయితే ఎక్కువ మంది కమెడియన్స్ హీరోలుగా సక్సెస్‌లను దక్కించుకోలేక పోయారు. అందరిలాగే శంకర్ కూడా హీరోగా మెప్పించలేక పోయాడు. హీరోగా మంచి స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తే ఫలితం ఉండేది. కాని సాదా సీదా కథను ఎంచుకున్న శంకర్ హీరోగా మొదటి సినిమాతో రాణించలేక పోయాడు. ఈ రెండు చిత్రాలతో పాటు కన్నుల్లో నీ రూపమే మరియు నా లవ్ స్టోరీ చిత్రాలు ప్రేక్షకలు ముందుకు వచ్చాయి. ఈ రోజు విడుదలైన ఏ ఒక్క చిత్రం కూడా ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలు దక్కించుకోలేక పోయింది. మరో వారం రోజులు మంచి చిత్రం కోసం ఎదురు చూడాల్సిందే అంటూ ప్రేక్షకులు నిటూర్చుతున్నారు.