Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇది బయోపిక్ ల సీజన్. అన్ని భాషల్లోనూ బయోపిక్ లు విడుదలై సంచలన విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. తెలుగులో ఇటీవల విడుదలైన మహానటి అద్వితీయ విజయాన్ని సాధించగా… ఎన్టీఆర్ జీవిత చరిత్ర నిర్మాణ దశలో ఉంది. సౌందర్య, ఉదయ్ కిరణ్ వంటి నటీనటుల జీవితాలను కూడా తెరకెక్కించనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక బాలీవుడ్ విషయానికొస్తే… హిందీ సినిమా చాలా ఏళ్లుగా… బయోపిక్ ల చుట్టే తిరుగుతోంది. సినీ ప్రముఖులతో పాటు పలువురు క్రీడాకారుల జీవితాలనూ తెరకెక్కిస్తోంది. మిల్కాసింగ్ జీవితం ఆధారంగా వచ్చిన భాగ్ మిల్కా భాగ్, మేరీకోమ్ జీవిత చరిత్ర, సచిన్ టెండూల్కర్, ఎంస్. ధోనీల బయోపిక్ లు బాలీవుడ్ ను ఓ ఊపు ఊపాయి. సైనా నెహ్వాల్, పి.వి.సింధు, క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ లకూ రంగం సిద్ధమయింది. అదే బాటాలో తాజాగా… మరో క్రికెటర్ జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు బాలీవుడ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
భారత క్రికెట్ లో కెప్టెన్సీకి అసలు సిసలు నిర్వచనం చెప్పి… తిరుగులేని కెప్టెన్ గా రాణించిన బెంగాల్ టైగర్ సౌరభ్ గంగూలీ జీవితాన్ని సినిమాగా మలచాలని ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలీఫిలింస్ యజమాని ఏక్తాకపూర్ భావిస్తోంది. డర్టీ పిక్చర్ తో సిల్క్ స్మిత జీవితాన్ని సినీ ప్రేక్షకులకు పరిచయం చేసిన ఏక్తాకపూర్ ఇప్పుడు దాదా బయోపిక్ పై దృష్టిపెట్టింది. గంగూలీ జీవితం ఆధారంగా రెండు నెలల క్రితం విడుదలయిన ఆటో బయోగ్రఫీ ఎ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్ ఆధారంగా సినిమా తీయాలని ఏక్తా భావిస్తోంది. దీనిపై సౌరభ్ ను కలిసి ఏక్తా చర్చించింది కూడా. అయితే తన బయోపిక్ ను కోల్ కతా కు చెందిన దర్శకుడు ఎవరైనా తెరకెక్కిస్తే బాగుంటుందని దాదా ఆశపడగా, ఏక్తా మాత్రం ముంబైకి చెందిన దర్శకుడినే ఎంపిక చేసుకోవాలని అనుకుంటోంది. విశ్వవిఖ్యాత లార్డ్స్ స్టేడియంతో పాటు ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రముఖ స్టేడియాల్లో గంగూలీ బయోపిక్ ను తెరకెక్కించాలన్నది ఏక్తా ఆలోచన. గంగూలీతో పాటు సినిమాలోని ఇతర పాత్రలకు త్వరలోనే నటీనటులను ఎంపిక చేసే అవకాశం ఉంది.