వన్డే ప్రపంచకప్ చరిత్రలో నయా ఛాంపియన్‌గా ఇంగ్లాండ్ అవతరించింది. న్యూజిలాండ్‌తో లార్డ్స్ వేదికగా ఆదివారం రాత్రి ఉత్కంఠగా ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో బౌండరీల కౌంట్ ద్వారా ఇంగ్లాండ్ జట్టు విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఖరి బంతి వరకూ పోరాడిన ఇంగ్లాండ్ టీమ్ సరిగ్గా 50 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌటైంది. దీంతో.. సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేయగా.. ఛేదనలో న్యూజిలాండ్ కూడా వికెట్ నష్టానికి సరిగ్గా 15 పరుగులే చేయడంతో మ్యాచ్ మళ్లీ టై అయ్యింది. దీంతో.. మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు బాదిన ఇంగ్లాండ్ టీమ్‌ని విజేతగా ప్రకటించారు. సూపర్ ఓవర్లో కలిపి ఇంగ్లాండ్ జట్టు మొత్తం 26 (ఫోర్లు, సిక్స్‌లు) కొట్టగా.. న్యూజిలాండ్ టీమ్ 17 మాత్రమే సాధించగలిగింది. దీంతో సూపర్ ఓవర్ టైగా ముగిసినా.. ఇంగ్లాండ్ టీమ్‌నే విజయం వరించింది. ప్రపంచకప్‌లో నాలుగోసారి ఫైనల్‌కి చేరిన ఇంగ్లాండ్ టీమ్ ఎట్టకేలకి తొలి కప్‌ని ముద్దాడగా.. న్యూజిలాండ్‌కి వరల్డ్‌కప్ అందని ద్రాక్షగానే మరోసారి మిగిలిపోయింది. మ్యాచ్‌లో గెలిపించే ఇన్నింగ్స్ ఆడిన బెన్‌స్టోక్స్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.