అసలు వివరాల్లోకి వెళ్తే… జిల్లాలోని గంటావారిపల్లె గ్రామానికి చెందిన మహిళ.. తిరుపతిలోని ఓటేరు ప్రాంతానికి చెందిన జానకిరామిరెడ్డి ఇంట్లో పని మనిషిగా చేసింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య అక్రమ సంబంధం కుదిరింది. కొన్నాళ్ల తర్వాత ఆమె సంబంధం వద్దనుకొని ఆ పనిమానేయడంతో జానకిరామిరెడ్డి ఆమెను లైంగికంగా వేధించ సాగాడు. ఇదే సమయంలో మండల పరిధి కురివికుప్పం కాలనీకి చెందిన ఓ వ్యక్తికి ఆ మహిళ జానకిరామిరెడ్డి నుంచి కొంత నగదును అప్పుగా ఇప్పించింది. అయితే గురువారం ఉదయం జానకిరామిరెడ్డి తనకు రావాల్సిన నగదును తీసుకోడానికి గంటావారిపల్లెకు వచ్చి తన డబ్బును ఇప్పించాలని ఆమెను కోరాడు. ఆమెను కూడా వెంట తీసుకెళ్లాడు.
కన్నికాపురం వద్దకు చేరుకున్నాక జానకిరామిరెడ్డి తనతో అక్రమ సంబంధం కొనసాగించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన జానకిరామిరెడ్డి పక్కనే ఉన్న రాయితో ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో జానకిరామిరెడ్డి ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే జానకిరామిరెడ్డి కత్తెరతో తనను తాను గాయపరుచుకున్నాడు. ఎస్సై సుమన్ తన సిబ్బందితో కలిసి అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరినీ పచ్చికాపల్లం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.