కాంగ్రెస్ లోకి రమ్మంటే తెలుగుదేశంలోకి వెళ్తున్నారు !

sailajanath meets chandrababu

పార్టీలో కిరణ్‌ కుమార్ రెడ్డి తిరిగిన చేరిన తర్వాత మంచి బూస్ట్ వస్తుందని భావించి ఘర్ వాపసీ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌. తమ నేతలు ఇప్పుడు యే పార్టీలో ఉన్నా, ఒకవేళ రాజకీయాలకి దూరంగా ఉన్నా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఫలితం కనపడటంలేదు. అందుకే ఎన్నికలు దగ్గరకు వస్తున్న సందర్భంగా అందరూ తమకు ఉపయోగపడే పార్టీలను చూసుకుంటున్నారు. దానికి తాజా సాక్ష్యం అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శైలజానాథ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.

అయితే తాను రాజకీయ కారణాలతో చంద్రబాబును కలవలేదని, ప్రజా సమస్యలపైనే కలిశానని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ తరపునే పోటీచేస్తానని, పార్టీ మారే ఉద్దేశం లేదని శైలజానాద్ చెబుతున్నా, ఆయన పార్టీ మారెందుకే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తన నిర్ణయాన్ని తెలిపి సీఎం ఆశీసులకోసమే ఆయన వచ్చారని ప్రచారం జరుగుతోంది. సీఎం కూడా అనంతపురం జిల్లా నేతలతో సమావేశమై ఆయన చేరికపై అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత శైలజానాథ్ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక పక్క కాంగ్రెస్ రా రమ్మని పిలుస్తుంటే కాంగ్రెస్ మాజీ నేతలు మాత్రం టీడీపీ వంక చూస్తున్నారు.

శైలజానాద్ ఒక్కరే కాక మాజీ మంత్రులు కోండ్రు మురళీ మోహన్, మాజీ ఎంపీ సబ్బం హరి మొదలయిన వారు టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారని, బాబు ఎప్పుడు పచ్చజెండా ఊపితే అప్పుడు వారు సైకిల్ ఎక్కే సూచనలు కనపడుతున్నాయి. దీంతో పాపం ఒక పక్క కాంగ్రెస్ రా రమ్మని పిలుస్తుంటే కాంగ్రెస్ మాజీ నేతలు మాత్రం టీడీపీ వైపు వెళుతున్నారు. వీరు తెలుగుదేశం తీర్ధం పుచ్చుకుని టికెట్ ల విషయంలో ఇబ్బందులు రాకుండా చంద్రబాబు మేనేజ్ చేసుకోగలిగితే ఆయా నియోజకవర్గాల్లో జగన్ కి చాలా మైనస్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రాభవం తగ్గాక చాలామంది కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు జగన్ పార్టీకి దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు తమ తమ నేతలు సైకిల్ ఎక్కితే వారు కూడా సైకిల్ ఎక్కడం గ్యారెంటీ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు టీడీపీలోకి వ‌స్తే జిల్లా రాజ‌కీయాల్లో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌నేదే ఆస‌క్తిక‌ర‌మైన అంశం అవుతుంది. ఇప్పటికే ఉన్న నేత‌లు వారి రాక‌ను ఎలా స్వాగ‌తిస్తారు, ఆయ‌న‌కి ఎలాంటి స‌హ‌కారం అందిస్తార‌నేది వేచి చూడాల్సిన అంశం.