కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డిపై విజయలక్ష్మి అనే మహిళ సంచలన లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే విజయలక్ష్మీరెడ్డి మీద బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేశారు. తనపై ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తోందని గండ్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయలక్ష్మీరెడ్డిపై 384, 504 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై విజయలక్ష్మి చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలు, నిరాధారమైనవని అధికార పార్టీకి చెందిన నేతలు ఆమెకు అన్నిరకాలా మద్దతు తెలుపుతూ నీచపు ఆరోపణలు చేయిస్తున్నారని రాజకీయంగా ప్రజల్లో తనకున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేక, తనను నేరుగా ఎదుర్కోలేక ప్రత్యర్థులు చివరికి ఓ మహిళతో లైంగిక ఆరోపణలు చేయించడం దురదృష్టకరమని వెంకటరమణారెడ్డి చెప్పుకొచ్చారు.
గండ్ర మీద వచ్చిన ఆరోపణలను కాంగ్రెస్ మహిళా విభాగం ఖండించింది. నిన్న గాంధీభవన్లో సీతక్క మాట్లాడుతూ.. గండ్రను రాజకీయంగా ఎదుర్కొలేక.. టీఆర్ఎస్ అతని వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. విజయలక్ష్మి అసత్య ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై తాము డీజీపీని కలువనున్నామని తెలిపారు. 2019లో గెలిచే అవకాశం ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ టార్గెట్ చేసి రాజకీయంగా బలహీన పరచాలని చూస్తోందని ఆరోపించారు. మహిళలను అడ్డుపెట్టుకుని నీచరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలన్నారు.