ఓ త్రివిక్రమ్ …“నేను ఒక్కడిని కాదు “అని తెలుసుకో .

Excellent Analysis on Trivikram Srinivas and his Movies
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

త్రివిక్రమ్ శ్రీనివాస్… ఈ పేరు తెలుగుసమాజానికి పరిచయం అవసరం లేదు. కావడానికి ఓ సినిమా రచయిత, దర్శకుడే అయినా అంతకు మించిన క్రేజ్ ఆయనకు వుంది. ఒక్క మాటతో చాలా మందికి తమ జీవితాన్ని చూసుకోగలిగేలా చేసిన త్రివిక్రమ్ అంటే ప్రత్యేక అభిమానం. ఆయన తెలుగు సినిమాల్లో డైలాగ్ లు రాసే విధానాన్ని సమూలంగా మార్చేశారు. వర్తమాన రచయితల మీద ఆ ప్రభావం ఎంతో వుంది. ఓ విధంగా చెప్పాలంటే సినిమా దర్శకుడు అయిన త్రివిక్రమ్ ను  తెలుగు సమాజం ఓ మేధావిలాగానే భావించింది. గౌరవించింది. కానీ 2018 , జనవరి 10 వ తేదీన ఆయన దర్శకత్వం వహించిన అజ్ఞాతవాసి చూసాక పెద్ద షాక్. త్రివిక్రమ్ సరిగ్గా సినిమా చేయలేదన్న కోపం కన్నా తమ నమ్మకాన్ని ఇలా వమ్ము చేసాడు అన్న ఆవేదనతో కూడిన ఆగ్రహమే ఎక్కువగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ ఎందుకిలా చేసాడు? అన్న ప్రశ్నకు కచ్చితం అయిన సమాధానం ఏదీ ఉండదు. సృజనాత్మక రంగంలో ఇలా ఒక్కోసారి జరుగుతుంటుందిలే అని సరిపెట్టుకోడానికి కూడా వీల్లేదు. నిజంగా చెప్పాలంటే ఈ సమస్యకు పరిష్కారం త్రివిక్రమ్ నిజాయితీగా ఆత్మశోధన చేసుకోవడమే.

pawan-kalyan-and-trivikram

త్రివిక్రమ్ లా చిన్న వయస్సులోనే పెద్ద మాటలు చెప్పే అవకాశం అందరికీ రాదు. చాలా మందికి ముదిమి మీద పడుతున్నా జీవితాన్ని ఎలా నడపాలో అన్న డ్రైవింగ్ సెన్స్ రాదు. ఆ సెన్స్ తెలిసిన వాడికి దాన్ని వ్యక్తీకరించేలా భాష, భావం మీద పట్టు ఉండదు. అందుకే ఆ రెండు విద్యలు తెలిసిన త్రివిక్రమ్ ని తెలుగు సినీ లవర్స్ గుండెల్లో పెట్టుకున్నారు. కానీ ఒక్క సినిమాతో ఆ అభిమానం మాట ఎలా వున్నా త్రివిక్రమ్ సత్తా మీద అనుమానాలు మొదలు అయ్యాయి. అప్పుడెప్పుడో ఓ సినిమా ప్రమోషన్ లో భాగం త్రివిక్రమ్ గురువు పోసాని ఓ మాట చెప్పాడు. ఏదో కొన్ని డైలాగ్స్ రాస్తాడు గానీ కథని సమగ్రంగా రాసుకోలేడని త్రివిక్రమ్ గురించి అనుకున్నట్టు పోసాని అప్పుడు వివరించారు. ఇక సమంత కూడా నేరుగా మీరు బుర్రతో పనిచేస్తున్నారు కానీ మనసు పెట్టి పనిచేస్తే ఇంకా అద్భుతాలు వస్తాయని త్రివిక్రమ్ తో చెప్పారట. ఆ విషయాన్ని ఒప్పుకున్న త్రివిక్రమ్ అందుకోసమే “అ ఆ “ తీసినట్టు చెప్పుకున్నారు. మూల కధకు కట్టుబడి ఏ జిమ్మిక్స్ లేకుండా నితిన్ తో తీసిన ఆ సినిమా పెద్ద హిట్. ఇక పవర్ స్టార్ లాంటి హీరో వున్నా నేల విడిచి సాము చేస్తే ఫలితం ఏంటో తెలిసిందే. ఈ రెంటినీ భేరీజు వేసుకుంటే మూలాలకు కట్టుబడడం అనేది ఎంత అవసరమో అర్ధం అవుతుంది.

trivikram

తెలుగు సమాజం గౌరవిస్తున్న తీరు, పెద్ద పెద్ద హీరోలే తనకు ఓ సినిమా చేసిపెట్టమని అడగడంతో త్రివిక్రమ్ కి గర్వం వచ్చింది అని చెప్పలేకపోయినా, అజ్ఞాతవాసి చేసినాక ఆయన్ని ఒంటరితనం ఆవహించింది అని మాత్రం చెప్పగలం. ఒంటరితనం అంటే చుట్టూ జనం లేకపోవడమే కాదు. అది సమాజాన్ని చదివేయడం వల్ల వచ్చిన ఒంటరితనం. ఎవరు ఎలా ప్రవర్తిస్తారో ముందుగానే అర్ధం చేసుకోవడం వల్ల వచ్చిన ఒంటరితనం. మనం చెప్పేది వినేవాళ్లే గానీ ఎందుకు అలా అని ప్రశ్నించే వాళ్ళు లేనప్పుడు కలిగే ఒంటరితనం. పదిమందితో కలిసి కొండెక్కడం మొదలెట్టి అందరికన్నా ముందుగానే పర్వతశిఖరం ఎక్కినప్పుడు కలిగే ఒంటరితనం. మనం నేర్పించడమే కానీ మనకు నేర్పే స్థాయి కలిగినవాళ్లు దగ్గరగా లేనప్పుడు కలిగే ఒంటరితనం. ఈ ఒంటరితనం మనిషిలో స్థబ్ధత పెంచుతుంది. మనం చేసేదే పని అనేలా చేస్తుంది. ఆత్మశోధనకు సమయం ఉండదు. వున్నా మనస్సాక్షిని జోకొట్టి, ఇగో ని రెచ్చగొట్టే వాళ్ళు చుట్టూ చేరతారు. అన్నీ సమస్యలే చెప్పారు. దీనికి పరిష్కారం లేదా అంటే ఎందుకు లేదు.

agntahvasi-movie
మనం మాములు మనుషులం అని అర్ధం చేసుకోవడం. మనం, మన జ్ఞానం ఇప్పటి సమాజం, మనుషుల కన్నా చాలా గొప్పగా వుంది . అందుకే వాళ్ళతో వేగలేక ఈ ఒంటరితనం అని త్రివిక్రమ్ లాంటి మేధావులు అనుకోవచ్చు. కానీ ఆ జ్ఞానం నేర్పింది ఈ సమాజమే. నేర్చుకోకుంటే మొట్టికాయలు వేసింది ఈ మనుషులే. వాళ్ళ మధ్య మనం మాములుగా ఉంటే అన్నీ చక్కబడతాయి. మూలాల్లోకి వెళ్లడమంటే మాములు మనిషిగా ఉండటమే. పనిలో, మనసులో అదే భావంతో నిజాయితీగా ముందుకు వెళ్లడమే. పేరు, ప్రతిష్ట, గౌరవం ఇవన్నీ ఒక్కసారి ఎంతటి మేధావికి అయినా “ నేను “ అనే భావాన్ని కలిగిస్తాయి. కానీ ఆ “నేను“ లో ఒక్కడు కాదు. అందులో పుట్టించిన తల్లితండ్రులు, చదువు చెప్పిన గురువులు, పక్కనే నడిచిన స్నేహితులు, వెనుక నడిచిన శిష్యులు, నువ్వులు విరబూయించిన అనుభూతులు, గుణపాఠాలు నేర్పిన అనుభవాలు… ఇలా గుర్తుకు తెచ్చుకుంటే ఎన్నో ఎన్నెన్నో… అందుకే త్రివిక్రమ్ ఇప్పుడు నేను ఒక్కడు కాదు అని గుర్తుకు తెచ్చుకుంటే చాలు. అన్నీ సర్దుకుపోతాయి. ఒంటరితనం పక్కకిపోయి సమూహం లో మళ్లీ ఒక్కడు అవుతాడు. పాత త్రివిక్రమ్ కనిపిస్తాడు. అభిమానుల్ని అలరిస్తాడు.

-కిరణ్ కుమార్