Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే వచ్చే ఎన్నికల్లో మరో ఆలోచన లేకుండా బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని, వైసీపీ అధినేత జగన్ ఓ ఇంగ్లీష్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీతో జగన్ రహస్య ఒప్పందం చేసుకున్నారని జరుగుతున్న ప్రచారానికి ఆయన వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఈ తరహా అభిప్రాయాన్నే వ్యక్తంచేశారు. జగన్ ఇంటర్వ్యూ తనలో ఎన్నో అనుమానాలను రేకెత్తించిందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి మద్దతు విషయంలో జగన్ చాలా వ్యూహాత్మకంగా మాట్లాడినట్టు తనకు అనిపించిందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోరన్న ఉద్దేశం జగన్ కు ఉన్నట్టు లేదని విశ్లేషించారు. 2019 ఎన్నికల్లోపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించి, అనంతరం బీజేపీ వైసీపీతో పొత్తపెట్టుకుని ఎన్నికల్లో గనక పోటీచేస్తే…జగన్ బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలు నిజమైనట్టే భావించాల్సి ఉంటుందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. జగన్, బీజేపీ కలిస్తే..ఏపీకి మంచి జరుగుతుందా…చెడు జరుగుతుందా…అన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలవలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడని, ఆ పరిస్థితికి ఆయన్ను నిందించలేమని, కాంగ్రెస్ అధిష్టానం వైఖరే ఇందుకు కారణమని ఉండవల్లి ఆరోపించారు. చంద్రబాబు వైఖరిపైనా ఉండవల్లి విమర్శలు గుప్పించారు. విభజన హామీలు అమలు కావడం లేదని, అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు తెలుసుకున్నారని, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తానంటున్న ఆయన, ముందు రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేశారన్న విషయాన్ని తేటతెల్లం చేయాలని డిమాండ్ చేశారు.