Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేసి ఇవాళ్టికి సరిగ్గా నాలుగేళ్లు. దేశంలో కొత్త శకానికి, సరికొత్త రాజకీయాలకు తెరలేపుతూ, ప్రజల ఆశలు, ఆకాంక్షల మధ్య మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. పదేళ్ల యూపీఏ అవినీతి పాలనతో విసిగిపోయి ఉన్న దేశ ప్రజలకు మోడీ ఆపద్బాంధవుడిలా కనిపించారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరనుంచి దేశాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్ ముద్రను మోడీ చెరిపివేస్తారని భావించారు. రైతులు, వ్యాపారులు,ఉద్యోగులు, యువకులు ఇలా అన్ని వర్గాల ప్రజలూ మోడీ పాలన గురించి ఎన్నో కలలు కన్నారు. దేశ దిశనూ, దశనూ మోడీ మార్చివేస్తారని నమ్మారు. మరి నాలుగేళ్ల కాలంలో ప్రజల ఆశలన్నింటినీ మోడీ తీర్చారా…తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా… దేశాన్ని సరికొత్త పంథాలోకి నడిపించారా అంటే అవునని సమాధానం ఎవరి దగ్గరినుంచీ రాదు. అలాగని మోడీ ఏమీ చేయలేదా…
పాలనలో తన మార్క్ చూపించలేదా..? ప్రజల కోసం ఎలాంటి మంచి కార్యక్రమాలూ చేపట్టలేదా… అంటే దానికీ అవునని చెప్పలేం. చెప్పినవన్నీ చేయకపోయినప్పటికీ, ప్రజల ఆశలన్నీ తీర్చలేకపోయినప్పటికీ… గతపాలకులతో పోలిస్తే మోడీ చాలా చేసినట్టే…మేడిన్ ఇండియా, స్వచ్ఛ భారత్, పెద్ద నోట్లరద్దు, జీఎస్టీ వంటి సాహసోపేత నిర్ణయాలతో మోడీ… పాలనలో తనదైన మార్క్ వేశారు. మోడీ పాలనలో మరొక ప్రత్యేక విషయం అనునిత్యం ఆయన గురించి దేశప్రజలంతా మాట్లాడుకునేలా చేయడం. మన్మోహన్ సింగ్ పదేళ్ల పాలనలో దేశ ప్రజల్లో ఉన్న నైరాశ్యం, నిర్లిప్తవాతావరణం కచ్చితంగా ఇప్పుడు లేవు. మోడీ పాలనపై సంతృప్తి ఉన్నా, అసంతృప్తి ఉన్నా..బహిరంగంగా ప్రజలంతా ఆ విషయాన్ని వెల్లడిస్తున్నారు కానీ…అది మనకు సంబంధం లేని విషయం అని నిర్లిప్తంగా ఊరుకోవడం లేదు. దీనికి కారణం మోడీ చేపట్టిన కార్యక్రమాలే కాదు….ప్రజలతో ఆయన మెయింటెన్ చేసే సంబంధాలు కూడా. సోషల్ మీడియా ద్వారానో..ఆకాశవాణి కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారానో ఆయన ప్రజలతో ఎప్పుడూ మాట్లాడుతున్నారు. అలాగే ప్రధాని హోదాలో ఎన్నో బహిరంగ సభల్లో ప్రసంగించారు.
ఈ కారణాల వల్ల ప్రజల్లో ప్రధాని అంటే అక్కడెక్కడో ఉంటారు… ఏదో చేస్తుంటారు అన్న భావన కాకుండా మన మధ్యలో, మనతో ఉండే వ్యక్తి ప్రధాని అన్న ఫీలింగ్ కలిగించారు. అలాగే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా దీటుగా బదులిచ్చారు. అంతేకాదు….ప్రధానిని వన్ మ్యాన్ ఆర్మీగా కూడా భావించవచ్చు. బీజేపీ ప్రభుత్వం అనగానే గుర్తొచ్చేది ఆయనొక్కరే. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార బాధ్యత కూడా ఆయనదే. బీజేపీలో కేంద్రమంత్రులు, సీనియర్ నాయకులు ఎందరు ఉన్నప్పటికీ ఇప్పుడు వారంతా మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చాటు నేతలే. ఒక్కముక్కలో చెప్పాలంటే పార్టీ అన్నా, ప్రభుత్వం అన్నా మోడీ, షానే. అంతగా బీజేపీపైనా, దేశంపైనా పట్టుసాధించారు మోడీ. ఈ నాలుగేళ్ల కాలంలో మోడీ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో కూడా దేశ ప్రజలకు అర్ధమయింది.
దేశరాజకీయాల్లో తలపండిన కాంగ్రెస్ కూడా మోడీ వ్యూహాల ముందు అనేక సార్లు చిత్తయింది. సీనియర్ నేత అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు, మొన్న జరిగిన కర్నాటక పరాభవం తప్ప..ఈ నాలుగేళ్ల కాలంలో ప్రతివిషయంలోనూ మోడీ వ్యూహాలకు కాంగ్రెస్ తలొంచింది. పార్టీ పరంగా బీజేపీ ఈ నాలుగేళ్లకాలంలో ఉన్నంత బలంగా ఇంతకుముందెన్నడూ లేదు. రెండు, మూడు మినహా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీనో, ఆ పార్టీ మిత్ర పక్షాలో అధికారంలో ఉండడానికి మోడీనే కారణమన్నది అందరూ ఒప్పుకునే విషయం. పాలన పరంగా చూస్తే..క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చెప్పడం కష్టం అయినప్పటికీ..దేశంలో గతంలో లేనిది ఏదో జరుగుతోంది అన్న పాజిటివ్ ఫీలింగ్ మాత్రం ప్రజల్లో ఉంది. అయితే ఈ సానుకూల దృక్పథం 2019 ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు తెచ్చిపెడుతుందా లేదా అన్నది మాత్రం ఊహించలేం. ఎందుకంటే..
మోడీ పాలనపై సానుకూల భావంతో ఎందరు ఉన్నారో…అంతకు రెట్టింపు సంఖ్యలో వ్యతిరేకించేవారూ ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ దుష్పరిణామాలతో పాటు నిత్యావసరాల ధరల పెరుగుదల, ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్ ధరలు…ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతనూ పెంచుతున్నాయి. ఈ పరిస్థితులే కొనసాగితే…మోడీకి సానుకూలంగా ఉన్నవారు కూడా ఎన్నికలలోపు …వ్యతిరేకంగా మారవచ్చు. అయితే నాలుగేళ్లకాలంలో ప్రజలకు సంభ్రమాశ్చర్యం కలిగే రీతిలో రాజకీయాలు నడిపించిన మోడీకి..ఎన్నికల ఏడాది ఎలా నడుచుకోవాలో..ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా తొలగించుకోవాలో..సానుకూలురు దూరం కాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తెలుసు….ఈ ఏడాదంతా మనం అదే చూడబోతున్నాం. అధికారం నిలబెట్టుకోవడానికి మోడీ, షాతో కలిసి చేసే విన్యాసాలు..చూసి దేశ ప్రజలు ముందు ముందు నివ్వెరపోక తప్పదు.