కాబోయే సీఎం పవన్ కళ్యాణ్.. చంద్రబాబు మద్దతు.. ఏపీలో మారిన రాజకీయాలు!

Pawan Kalyan
Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదని చెప్పారు. సీఎం పదవి తీసుకునేందుకు తాను సిద్ధమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. మొత్తానికి ఒక క్లారిటీ వచ్చింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆర్నెళ్ల సమయం ఉండగానే.. రాజకీయం రసకందాయంగా మారింది. కాబోయే సీఎం ఎవరనే విషయంపై స్పష్టతైతే వచ్చింది. అయితే, ‘చివరిగా ఛాన్స్ ఇవ్వండి’ అంటూ ఇప్పటిదాకా చెబుతూ వస్తున్న బాబు గారు .. ‘సీఎం పదవి అడిగే బలం నాకు లేదు’ అని చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్.. ఒక్కసారిగా తమ స్ట్రాటజీ ఎందుకు మార్చుకున్నారు? భవిష్యత్తులో ఏం జరగబోతోంది? కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లుగా లోకేష్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని పాదయాత్రతో చుట్టేస్తున్న .. చివరికి పవన్ కళ్యాణ్‌కే సీఎం పదవిని అప్పగించాల్సిందేనా? మరి వైఎస్ జగన్ పరిస్థితి ఏంటి?

ఆలు లేదు, చూలు లేదుగానీ.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు.. ఎలక్షన్లు కాకుండానే, అసలు గెలుస్తారో, లేదో తెలియకుండానే ఈ సీఎం పదవి గొడవ ఏంటి? అంటారా..! అక్కడికే వస్తున్నా.ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ తమను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేకే పొత్తులు పెట్టుకుంటున్నారంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ‘దత్తపుత్రుడు పనిచేసేది చంద్రబాబు నాయుడు కోసమే’ అంటూ పవన్ కళ్యాణ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని మళ్లీ అధికారంలోకి వచ్చేదని దీమా వ్యక్తం చేస్తున్నారు.

దీనికి తోడు..ప్రతి గడపకూ తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అందుతున్నాయనే దీమా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉంది. అమరావతిపై, మూడు రాజధానుల అంశంపై, వాలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. అవేవీ పనిచేయవని, ప్రజలు మళ్లీ తమకే ఓటేస్తారని బలంగా నమ్ముతున్నారు.

వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్ బిజీబిజీగా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. అటు నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ప్రాజెక్టుల సందర్శన తదితర కార్యక్రమాలతో పాటు ,ఇటు విజన్ 2047లో భాగంగా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కానీ, ఆ నమ్మకం ఎన్నికల్లో పనిచేస్తుందా? ఓట్లను కురిపిస్తుందా? ఎక్కడో ఏదో అనుమానం. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన తమ వ్యూహాలను మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి పదవిపై ఎవరు ఏమంటున్నారు?

శుక్రవారం (ఆగస్టు 18) రోజున ‘నేను ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా..’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పిఠాపురం, గాజువాక సభల్లోనూ ఈ విషయాన్ని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన 10 ఏళ్ల తర్వాత ప్రజా సమస్యలపై ఇప్పుడు తనకు పూర్తి అవగాహన ఉందని తాను ఈ మాట చెప్తున్నానని.. ఆయన తెలిపారు. అయితే, రాబోయేది బీజేపీ ,జనసేన ప్రభుత్వమా.. లేదా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమా అనేది త్వరలోనే తేలుతుందని.. చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడు ‘ఇప్పుడు నాకు సీఎం పదవి కావాలా?.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా. ’ అని అంటున్నారు. ఏపీ భవిష్యత్తు కోసమే తాను పోరాటం చేస్తున్నానని సంకేతాలు పంపిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదని ఇరువురు నేతలు గట్టిగా నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా జగన్ సర్కార్‌ను గద్దె దించాలనేది లక్ష్యం. ఆయన అనుసరించే వ్యూహాలు కాకలు తీరిన నేతలకే అర్థం కావు. అసలు ప్లాన్ ఏంటనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!