Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కోల్ కతా అనగానే భారత క్రికెట్ అభిమానులకు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పేరే గుర్తుకొస్తుంది. కోల్ కతా నుంచి క్రికెట్ లో అడుగుపెట్టిన గంగూలీ కెప్టెన్ స్థాయికి చేరాడు. భారత క్రికెట్ కెప్టెన్సీకి గంగూలీ కొత్త నిర్వచనం చెప్పాడు. సంప్రదాయ పద్ధతిలో సాగే కెప్టెన్సీకి రాజసం తెచ్చిపెట్టాడు. తన దూకుడైన కెప్టెన్సీతో బెంగాల్ టైగర్ కొత్త ఒరవడి సృష్టించాడు. అందుకే ఆయన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి దాదాపు పదేళ్లు కావొస్తున్నా… దాదాను క్రికెట్ అభిమానులు మర్చిపోలేదు.
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అడిగిన ఓ ప్రశ్నకు ట్విట్టర్ లో క్రికెట్ అభిమానుల నుంచి వచ్చిన సమాధానాలే ఇందుకు నిదర్శనం. భారత్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు రెండో వన్డే కోసం కోల్ కతాలో బస చేసింది. ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి కోల్ కతా చుట్టిరావాలనుకున్నాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. గుడ్ మార్నింగ్ కోల్ కతా… నగరంలో అద్భుత దర్శనీయ ప్రాంతాలేవో చెప్తారా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు డేవిడ్ వార్నర్. వార్నర్ కు సమాధానమిస్తూ క్రికెట్ అభిమానులు కోల్ కతాలో అన్నింటికన్నా ముందుగా దాదా ఇంటిని దర్శించాలని సరదాగా సలహా ఇచ్చారు. కచ్చితంగా గంగూలీ ఇంటిని సందర్శించాల్సిందే అని… బతికున్న ఓ చక్రవర్తి రాజ్యాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుందని అభిమానులు ట్వీట్ చేశారు.
గంగూలీ మైదానంలో దిగి ఏళ్లు గడుస్తున్నా… ఇప్పటికీ కోల్ కతా అంటే అభిమానులకు దాదానే గుర్తొస్తున్నాడు. ప్రత్యక్షంగా ఆడకపోయినప్పటికీ సౌరభ్ గంగూలీ క్రికెట్ కు మాత్రం దూరం కాలేదు. రిటైర్మంట్ తర్వాత కొన్నాళ్లు ఐపీఎల్ ఆడిన బెంగాల్ టైగర్ 2011 ప్రపంచకప్ సమయంలో కామెంటేటర్ గానూ రాణించాడు. తర్వాత క్రికెట్ పాలకమండలిలో సభ్యుడయ్యాడు. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు