పెళ్లి అయిపోతే ఇంట్లో వాళ్ళని వదిలేసి ఎక్కడికో వెళ్లి బతకాల్సి వస్తుందన్న బెంగతో ఒక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం జన్నారం మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన టేకుమంట్ల రాజన్న, పంకజ దంపతులకు ముగ్గురు సంతానం. ఇందులో రెండో కూతురు ఆమని(28) ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఎస్బీఐలో క్యాషియర్‌గా పనిచేస్తోంది. ఈ మధ్యనే వివాహం నిశ్చయమైంది. ఈ నెల 4న నిశ్చితార్థం కూడా జరిపారు. ఈరోజు వివాహం జరగాల్సి ఉంది.
ఆమనిని వివాహం చేసుకునే వరుడు ముంబయిలో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం చేసుకుని ముంబయికి వెళ్ళాలనే బెంగతో ముభావంగా ఉండేది. గమనించిన తల్లిదండ్రులు నచ్చజెప్పారు. అయినా దూరంగా వెళ్లి ఉండటం భరించలేని ఆమని ఇంట్లో ఉన్న సూపర్‌వాస్మోల్ తాగి పడిపోయింది. గమనించిన కుటుంబీకులు వెంటనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్ తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. ఈరోజు పెళ్లి చేసుకుని మొగుడితో హాయిగా సంసారం చేసుకోవాల్సిన అమ్మాయి మృతి చెందడంతో వారి తల్లి దండ్రులని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు