Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగులో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ లో హీరోయిన్ ఎవరనేదానిపై కోలీవుడ్ లో ఆసక్తికర చర్చ జరగుతోంది. అర్జున్ రెడ్డిగా విక్రమ్ కుమారుడు ధృవ్ నటిస్తున్నాడు. గడ్డంతో ఉన్న ధృవ్ లుక్ ను చిత్రయూనిట్ ఇటీవలే రిలీజ్ చేసింది. హీరోగా తమిళ్ లో స్టార్ హీరో నటిస్తున్నట్టే… ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురు హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. గౌతమి కూతురు సుబ్బులక్ష్మి షాలినీ పాండే క్యారెక్టర్ పోషించనున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కూతురుని హీరోయిన్ గా చేయాలని భావిస్తోన్న గౌతమి… అర్జున్ రెడ్డిలాంటి సినిమా ద్వారా ఆమె సినీరంగంలో ప్రవేశిస్తే మంచి భవిష్యత్ ఉంటుందన్న ఆలోచన చేస్తోన్నట్టు తెలుస్తోంది. అయితే అర్జున్ రెడ్డి లో ఉన్న ముద్దు సన్నివేశాలను కూతురితో చేయించే విషయంపై గౌతమి వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజయిన అర్జున్ రెడ్డి తెలుగులో బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టింది. కథ పాతదే అయినా టేకింగ్, క్యారెక్టర్స్ లో హీరోహీరోయిన్ల ఇన్ వాల్వ్ మెంట్ కొత్తచరిత్ర సృష్టించాయి. సరిగ్గా చెప్పాలంటే తెలుగులో హీరో క్యారెక్టరైజేషన్ అర్జున్ రెడ్డి తర్వాత… అర్జున్ రెడ్డి ముందు అన్నంతగా ప్రభావితం చేసింది. అదేసమయంలో సినిమాపై ఓ నెగటివ్ టాక్ కూడా వచ్చింది. ముద్దు సీన్ల వల్ల సినిమా హిట్టయ్యిందన్న విమర్శలూ వినిపించాయి. సినిమాపై మహిళాసంఘాల అభ్యంతరాలూ వ్యక్తమయ్యాయి. ఇవన్నీ దాటుకుని తెలుగులో అర్జున్ రెడ్డి… కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. తమిళంలో పరిస్థితి వేరు. సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ విషయం పక్కన పెడితే కాస్త సంప్రదాయ తరహాలో ఉండే తమిళులు… ఈ తరహా సినిమాను యాక్సెప్ట్ చేస్తారా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. సినిమా హిట్, ఫ్లాప్ సంగతి పక్కనపెడితే గౌతమి కూతురుగా సుబ్బులక్ష్మిని అలాంటి క్యారెక్టర్ లో తమిళ ప్రేక్షకులు ఇష్టపడతారా లేదా అన్నది కూడా సినిమా సక్సెస్ ను ప్రభావితం చేసే అవకాశముంది.