Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను గవర్నరే కలుపుతున్నారనే వార్తలు పత్రికల్లో వస్తున్నాయని, గవర్నర్ స్థానంలో ఉన్న వ్యక్తి అలా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. అసలు గవర్నర్ వ్యవస్థే వద్దని టీడీపీ గతంలోనే చెప్పిందని, ఆ అంశంపై పోరాటం కూడా చేశామని గుర్తుచేశారు. ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకోవాల్సిన వ్యవస్థ గవర్నర్ వ్యవస్థని, వార్తాపత్రికల్లో వార్తలొచ్చేలా గవర్నర్ పనిచేయడం మంచిపద్ధతి కాదని హితవుపలికారు. విజయవాడలో ముఖ్యమంత్రితో అత్యవసరంగా సమావేశమైన గవర్నర్… ఆ తర్వాత హడావిడిగా ఢిల్లీ వెళ్లడం వంటి పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇప్పటికే గవర్నర్ వ్యవహారశైలిపై ఏపీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గవర్నర్ హోదాలో నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సహకరించకపోగా… ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలు అందజేశారని ప్రచారం జరుగుతోంది. చాలా రోజులనుంచీ ఇలాంటి ప్రచారం సాగుతున్నా ఎప్పుడూ స్పందించని చంద్రబాబు గవర్నర్ తో భేటీ తర్వాత… ఆయనపై విమర్శలు చేయడం గమనిస్తే… ఈ ప్రచారం నిజమేనన్న అభిప్రాయం కలుగుతోంది. రాజ్ భవన్ కు పరిమితం కావాల్సిన గవర్నర్… రాజకీయాల్లో తలదూర్చడం, బీజేపీ వ్యూహాలను అమలుచేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పలువురు విశ్లేషిస్తున్నారు.