గృహం… తెలుగు బులెట్ రివ్యూ

Gruham Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :  సిద్ధార్థ్ , ఆండ్రియా 

నిర్మాత:  సిద్ధార్థ్ నారాయణ్ 
దర్శకత్వం :   మిలింద్ రావ్ 

మ్యూజిక్ :  గిరీష్ 

తెలుగునాట లవర్ బాయ్ ఇమేజ్ వున్న సిద్ధార్థ కొన్నాళ్లుగా సక్సెస్ ఇక్కడ సక్సెస్ చూడలేకపోయారు. అందుకే తమిళంలో మాత్రమే కొన్నాళ్లుగా సినిమాలు చేస్తున్నారు. అక్కడ వైవిధ్యభరితమైన సినిమాలు సెలెక్ట్ చేసుకుని ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలా తమిళ్ లో హిట్ అయిన “ అవళ్” సినిమా డబ్బింగ్ వెర్షన్ ఇప్పుడు మనం విశ్లేషించబోతున్న “గృహం “ సినిమా. లవర్ బాయ్ ఇమేజ్ వున్న సిద్ధార్థ ఈ హారర్ మూవీ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడో,లేదో చూద్దాం.

కథ…

క్రిష్ ( సిద్ధార్ధ ), లక్ష్మి ( ఆండ్రియా) ముచ్చటైన దంపతులు. తమ ప్రేమ కి సంబంధించిన తీపి గురుతుల్లో తేలిపోతున్న ఆ దంపతుల పక్క ఇంటిలోకి కొత్తగా ఓ కుటుంబం వస్తుంది. ఆ కుటుంబానికి చెందిన యువతికి క్రిష్ అంటే ఇష్టం కలుగుతుంది. అప్పటినుంచి ఆ రెండు ఇళ్లలో అనుకోని పరిణామాలు ఎదురు అవుతాయి. ఏదో తెలియని శక్తి వారిని భయపెడుతుంది. కొన్ని అనర్ధాలు జరుగుతుంటాయి. క్రిష్ మీద మోజుపడ్డ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. లక్ష్మికి గర్భం వస్తుంది. ఈ పరిస్థితుల్లో అక్కడి సమస్యని పరిష్కరించడానికి ఓ భూత వైద్యుడు సాయం కూడా తీసుకుంటారు. ఎవరూ ఊహించని విధంగా క్రిష్ ని ఓ ఆత్మ ఆవహిస్తుంది. ఎప్పుడో పూర్వకాలంలో ఆ ఇంటిలో నివసించిన ఓ చైనీస్ కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్ల ఆత్మలు క్రిష్ తో తలపడతాయి. వీటి వెనుక వున్న కారణం ఏమిటి? క్రిష్ , లక్ష్మి జీవితం ఏ మలుపు తిరుగుతుంది ? క్రిష్ ని ఇష్టపడ్డ అమ్మాయి కి ఏ అనుభవం మిగులుతుంది అన్నదే మిగిలిన సినిమా.

విశ్లేషణ…

సైన్స్ గొప్పదా, విశ్వాసం గొప్పదా అన్న చర్చ ఈనాటిది కాదు. అదే పాయింట్ ని ఆధారం చేసుకుని చేసిన సినిమా ఇది. అప్పుడెప్పుడో ఇంగ్లీష్ లో వచ్చిన “ ది హౌస్ నెక్స్ట్ డోర్ “ సినిమా స్పూర్తితో ఈ కధ రాసుకున్నారు. ప్రతి విషయానికి సైన్స్ ఓ కారణం చెబుతుంది. ప్రతి సమస్య వెనుక వున్న కారణాలు వివరిస్తుంది. అయితే సమస్య పరిష్కారంలో మాత్రం విశ్వాసం అవసరం పడుతుంది. సైన్స్, విశ్వాసం కలిస్తేనే పరిష్కారం దొరుకుతుంది అన్న పాయింట్ చాలా క్లిష్టం. అయితే దీన్ని సులువుగా అర్ధం అయ్యేలా చెప్పడంలో దర్శకుడు మిలింద్ సక్సెస్ అయ్యాడు. కేకలు, అరుపులతో కాకుండా హారర్ సీన్స్ తయారు చేసుకున్న తీరు కొత్తగా వుంది.

క్రిష్ గా కొత్త సిద్ధార్థ ని ఈ సినిమాలో చూడొచ్చు. ఆండ్రియా, అనిషా విక్టర్ పాత్రలు మనల్ని సినిమా అయ్యాక కూడా వెంటాడతాయి. సినిమా కథతో పాటు వారి ప్రతిభ అందుకు ఓ కారణం. సైక్రియాటిస్టు ప్రసాద్ పాత్రలో సురేష్, అతుల్ కులకర్ణి నటన కూడా మనకు ఆలా గుర్తు ఉండిపోతాయి. హారర్ జానర్ లో ఈ మధ్య కామెడీ మిక్స్ అయిన సినిమాలు తెగ వచ్చేసాయి. అవి కూడా రొటీన్ అయిపోయిన తరుణంలో హారర్ కి లాజిక్, సైన్స్ మిక్స్ చేసిన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది. అయితే కంటెంట్ లో వున్న క్లిష్టత అందరికీ ఎంతవరకు అర్ధం అవుతుంది అన్నదానిపై ఈ చిత్రం విజయం ఆధారపడి ఉంటుంది.

తెలుగు బులెట్ పంచ్ లైన్ … ఈ ”గృహం “ లో నమ్మకం, భయం రెండూ వున్నాయి.
తెలుగు బులెట్ రేటింగ్… 3 .25 / 5 .