Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దాచేపల్లి దారుణంలో నిందితుడు సుబ్బయ్యను 15 రోజుల్లోగా అరెస్ట్ చేయకపోతే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని గుంటూరు రూరల్ ఎస్పీ అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దాచేపల్లిలో నిరసన తెలియజేస్తున్న ముస్లింసంఘాలు, ప్రజలకు నచ్చచెప్పేందుకు ఎన్నిరకాలుగా ప్రయత్నాలు చేసినా వారు వినకపోవడంతో..అందరినీ ఉద్దేశించి ఎస్పీ మాట్లాడారు. తన మాట వినాలని, సమస్యను శాంతిభద్రతల సమస్యగా మార్చొద్దని కోరారు. నిందితుడి కుటుంబసభ్యులంతా తమ ఆధీనంలోనే ఉన్నారని, సుబ్బయ్య తప్పించుకునే అవకాశం లేదని నచ్చజెప్పారు. సుబ్బయ్యకు ఉరిశిక్ష పడేలా చూస్తామని హామీఇచ్చిన ఎస్పీ….నిరసనలు ఆపివేయాలని విజ్ఞప్తిచేశారు. వర్షంలోనూ నిరసనకారులు ఆందోళన కొనసాగించారు.
దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో దుమారంరేపింది. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిందితుడిని పట్టించినవారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. అటు వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఈ దారుణంపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.