Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ ఎన్నికల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం గుజరాత్ వస్తున్నరాహుల్ అక్కడి దేవాలయాలను సందర్శిస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. రాహుల్ మధ్యయుగం నాటి సుల్తాన్ ల మార్గాన్ని అనుసరిస్తున్నారని బీజేపీ విమర్శించింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అనేక దేవాలయాలను ధ్వంసం చేశారని, ప్రజలు వ్యతిరేకించినప్పుడు మాత్రం ఆలయాలను నిర్మిస్తామని హామీ ఇచ్చేవాడని, అల్లావుద్దీన్ ఖిల్జీ సైతం అలాగే చేసేవారని, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వారి బాటలోనే పయనిస్తున్నాడని బీజేపీ ఆరోపించింది. హిందుత్వ కార్డును ప్రయోగించడం ద్వారా మెజార్టీ వర్గాన్ని ఆకర్షించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని మండిపడింది. అయోధ్య లో ఆలయ నిర్మాణంపై రాహుల్ మౌనం వీడాలని డిమాండ్ చేసింది. రాహుల్ ఆలయాల సందర్శనను ఓ నాటకంగా అభివర్ణించింది.
భారత్ పై 17 సార్లు దండెత్తి విలువైన సంపదను కొల్లగొట్టిన మహ్మద్ గజనీ జయంతి జరపడం కాంగ్రెస్ కు ఓ కల అని, గుజరాత్ లో ఆ కలలు నెరవేరవని అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. కర్నాటకలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ గుజరాత్ లో మహ్మద్ గజనీ జయంతి నిర్వహించాలని భావిస్తోందని ఆరోపించారు. రాహుల్ ఎన్ని పన్నాగాలు పన్నినా గుజరాత్ లో కాంగ్రెస్ గెలుపు అసాధ్యమన్నారు.