Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అతిలోకసుందరి శ్రీదేవి మరణించిన దగ్గరనుంచి ఆమె బయోపిక్ పై చర్చ జరుగుతోంది. శ్రీదేవి వీరాభిమాని అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ బయోపిక్ ను తెరకెక్కిస్తారని వార్తలొచ్చినప్పటికీ శ్రీదేవి లాంటి హీరోయిన్ ఎవరూ లేరని, ఆమె జీవితం తెరకెక్కించడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పేసారు. శ్రీదేవి స్థానంలో మరో హీరోయిన్ ని ఊహించుకోలేక వర్మ ఆ ఆలోచనే చేయకపోయినా… టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కు చెందిన ఇతర దర్శకులు చాలామందికి శ్రీదేవి బయోపిక్ తీయాలనే కోరిక ఉంది. వారిలో బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా ఒకరు. శ్రీదేవి బయోపిక్ తీసి దాన్ని ఆమెకే అంకితమవ్వాలన్నది హన్సల్ మెహతా కోరిక.
నిజానికి ఆయనకు శ్రీదేవితో ఓ సినిమాను చేయాలనే కల ఉండేది. ఆమె కోసం ఓ కథను కూడా సిద్దం చేశారు. కానీ దురదృష్టవశాత్తూ శ్రీదేవి మరణించడంతో ఆయన కల నెరవేరలేదు. అందుకే ఆమె బయోపిక్ తీయాలని భావిస్తున్నారు. శ్రీదేవి జీవితంపై తాను కచ్చితంగా ఓ సినిమా చేయగలనని ఆయన ఓ ఇంగ్లిష్ పత్రికతో చెప్పారు. శ్రీదేవి పాత్ర కోసం కొందరి హీరోయిన్ల పేర్లు తన మనసులో మెదులుతున్నాయని, డర్టీపిక్చర్ లో సిల్క్ స్మిత పాత్ర పోషించిన విద్యాబాలన్ తో సినిమా తీసే అవకాశముందని తెలిపారు. వెండితెరపై మరో శ్రీదేవి రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా శ్రీదేవి భర్త బోనీకపూర్ కూడా తన భార్యపై లఘుచిత్రం తీసే యోచనలో ఉన్నారని, ఇందుకోసం మిస్టర్ ఇండియా దర్శకుడు శేఖర్ కపూర్ ను సంప్రదించారని సమాచారం.