సినీనటుడు మాజీ ఎంపీ హరికృష్ణ ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రి నుండి వచ్చిన హరికృష్ణ బౌతిక కాయం ఆయన మెహిదీపట్నం ఇంటిలో ఉంచారు. రేపు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. రేపు ఉదయం ఎన్టీఅర్ ట్రస్ట్ భవన్ కు ఆయన కాయాన్ని తీసుకెళ్ళి అక్కడ కొంత సేపు ఉంచి ఆ తరువాత అంతిమ యాత్రగా ఆయన కాయాన్ని మొయినాబాద్ తీసుకువెళతారు. అయితే అందుతున్న సమాచారం మేరకు పెద్దాయన 1983లో రాష్ట్రమంతటా ప్రచారం నిర్వహించిన చైతన్యరథంపై హరికృష్ణ అంతిమయాత్ర నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.
తండ్రి ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి రధసారధి అయి నడిపించారు హరికృష్ణ. అందుకే ఆ రధం అంటే ఆయనకు మక్కువ ఎక్కువ దీంతో అదే చైతన్య రథం మీద హరికృష్ణ అంతిమయాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామకృష్ణ సినీ స్టూడియోలో ఉన్న చైతన్యరథాన్ని అంతిమయాత్రకు సిద్ధం చేస్తున్నారు. 72 వేల కిలోమీటర్ల ఎన్టీఆర్ యాత్రకు హరికృష్ణ సారథిగా ఉన్నారు. తర్వాత హరికృష్ణ ఇదే వాహనాన్ని 1999లో తన సొంత పార్టీ అన్న టీడీపీ ప్రచారానికి ఉపయోగించుకున్నారు.
మరోవైపు హరికృష్ణ అంత్యక్రియలు మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. నందమూరి జానకిరామ్ అంత్యక్రియలను కూడా ఇక్కడే నిర్వహించారు. దీంతో హరికృష్ణకు కూడా అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. మాజీ ఎంపీ, మాజీ మంత్రి టీడీపీ నేత నందమూరి హరికృష్ణకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. హరికృష్ణ కుటుంబసభ్యులతో మాట్లాడి దానికి సంబంధించిన ఏర్పాట్లను చూడాలంటూ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషిని తెలంగాణా సీఎం కేసీఆర్ ఆదేశించారు.